సదస్సులకు రండి
సందేహాలా..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు జిల్లావ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న ధరణి చట్టాన్ని రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా భూ భారతిని ప్రవేశపెట్టిన విషయం విదితమే. తద్వారా పరిష్కారమయ్యే సమస్యలు, దరఖాస్తు విధానాన్ని వివరించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటుచేస్తున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేయడమే కాక వారి నుంచి దరఖాస్తులే కాక సూచనలను సైతం స్వీకరిస్తున్నారు. జిల్లాలో పైలట్ మండలంగా ఎంపికై న నేలకొండపల్లి మండలంలోని రెవెన్యూ గ్రామాల్లోనే కాక అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న సదస్సులు ఈనెల 30వ తేదీ రకు కొనసాగుతాయి.
తొలుత అధికారులకు..
భూ భారతి కొత్త ఆర్‌ఓఆర్ చట్టంపై తొలుత అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తహసీల్దార్లకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చట్టంలోని అంశాలను వివరించారు. ఆ తర్వాత వారు మండల, గ్రామస్థాయి అధికారులకు రికార్డుల్లో తప్పుల సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, వారసత్వ భూముల మ్యుటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టాదారు పాసుపుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ, రివిజన్ అధికారాలు, తప్పుచేసిన అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయనే అంశాలపై విశదీకరించారు.
సదస్సులపై ప్రత్యేక దృష్టి
పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న నేలకొండపల్లి మండలంలోని రెవెన్యూ గ్రామాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో సదస్సులు కొనసాగుతున్నాయి. ఎంపీడీఓ, ఎంపీఓ, వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొని చట్టంలోని అంశాలను వివరిస్తున్నారు. కనీసం 500 మందికి తగ్గకుండా రైతులు పాల్గొనేలా దృష్టి సారించడంతో మంచి స్పందన వస్తోంది.
రైతుల సందేహాల నివృత్తికి..
జిల్లా వ్యాప్తంగా రైతులను భూములకు సంబంధించి అనేక సమస్యలు వేధిస్తున్నాయి. కొన్నేళ్లుగా వీటికి పరిష్కారం లభించక వివాదాలు నెలకొంటున్నాయి. గత ప్రభుత్వం అమలుచేసిన ధరణి అన్ని సమస్యలకు పరిష్కారం చూపలేకపోయింది. దీంతో ఈ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై అవగాహన కల్పిస్తూనే రైతులకు సమాచారం ఇవ్వడం, దరఖాస్తుల స్వీకరణకు తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటుచేశారు. ఇక్కడ ఎదురయ్యే సందేహాలు, అందే ప్రతీ దరఖాస్తును రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు.
భూ భారతి చట్టంపై విస్తృత అవగాహన
నేలకొండపల్లి మండలంలోని గ్రామాలతో పాటు మిగతా మండలాల్లోనూ నిర్వహణ
రైతులకు సమాచారం ఇచ్చేలా
తహసీల్‌లలో హెల్ప్‌డెస్క్‌లు
ఈనెల 30వరకు సదస్సులు
భూ భారతి చట్టంపై అవగాహన కోసం ఈనెల 17న ప్రారంభమైన సదస్సులు 30వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో సదస్సులు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలతో పాటు, మధిర నియోజకవర్గంలోని పలు మండలాల్లో సదస్సులు పూర్తయ్యాయి. ఈనెల 25న వైరా నియోజకవర్గ పరిధి వైరా మండలం, ఏన్కూరు మండలంలో, 26న కొణిజర్ల, సింగరే ణి, 28న సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి, వేంసూరు, 29న కల్లూరు, పెనుబల్లి, 30న ఉదయం తల్లాడ మండలంలో సదస్సులు జరగనున్నాయి.
సదస్సులకు రండి


