ఆఫ్‌టైప్ మొక్కలపై కదలిక..
● ఆయిల్‌పామ్ తోటల్లో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, శాస్త్రవేత్తల పరిశీలన ● పరిహారం రాకున్నా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి
సత్తుపల్లి: ఆయిల్‌ఫెడ్ నర్సరీల నుంచి ఆఫ్‌టైప్ మొక్కలు పంపిణీ అయ్యాయని, తద్వారా ఐదేళ్ల వయస్సు కలిగిన మొక్కలు తొలగించాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతుండగా.. ఎట్టకేలకు యంత్రాంగం స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అశ్వారావుపేట జోన్ ఫార్మర్ సొసైటీ ప్రతినిధులు ఇటీవల ఢిల్లీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌కు విన్నవించారు. అలాగే, ఎస్టీ కమిషన్ సభ్యుడిని గిరిజన రైతులు కలిశారు.
తోటల్లో పరిశీలన
రైతుల ఫిర్యాదులతో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, శాస్త్రవేత్తలు గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. రిటైర్డ్ శాస్త్రవేత్త బీఎన్.రావు, అధికారులతో కలిసి సత్తుపల్లి మండలం నారాయణపురంలో జగ్గవరపు దామోదర్‌రెడ్డి, మోరంపూడి స్వర్ణలత, గౌరిగూడెంలో పాలపాటి శ్రీనివాసరావు తోటలను పరిశీలించారు. ఈసందర్భంగా చైర్మన్ రాఘవరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి మండలం రేగళ్లపాడు నర్సరీ నుంచి 3లక్షల ఆఫ్‌టైప్ ఆయిల్‌పామ్ మొక్కలు పంపిణీ చేశారనే ప్రచారంలో నిజం లేదన్నారు. మొత్తంగా 11కు గాను ఐదు నర్సరీల్లోనే సమస్యలు ఎదురైనట్లు తేలిందని చెప్పారు. నర్సరీ లను ప్రక్షాళన చేస్తే 50శాతం సమస్యలు తీరతాయని చెప్పారు. నాసిరకం మొక్కలు పంపిణీ చేస్తున్నారనే ప్రచారంతో ఆయిల్‌పామ్ సాగుకు కొత్త రైతులు ముందుకు రావడం లేదన్నారు. ఈనేపథ్యాన స్వ యంగా తోటల పరిశీలనకు వచ్చామని తెలిపారు. కాగా, నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని వెల్లడించిన చైర్మన్.. ఉద్యోగుల్లో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేశారు. జీఎం సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్‌రెడ్డి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఇన్‌చార్జ్‌లు ఆర్.రామకృష్ణ, రాధాకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్లు, రైతు సంఘం ప్రతినిధులు తుంబూరు మహేశ్వరరెడ్డి, చెలికాని సూరిబాబు, చెలికాని వెంకట్రావు, బండి శ్రీనివాసరెడ్డి, చక్రధర్‌రెడ్డి పాల్గొన్నారు.


