ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు..
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ● కేంద్రాలను తనిఖీ చేసిన రాష్ట్ర బృందం
ఖమ్మం సహకారనగర్: రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని నాణ్యత ఆధారంగా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లోని గురువారం ఆయన రాష్ట్ర బృందం సభ్యులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 29,695 టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, 799మంది రైతులు 6,165 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం అమ్మారని తెలిపారు. వీరికి రూ.3,08,25,600 మేర బోనస్ అందిందని చెప్పారు. తొలుత పౌర సరఫరాలశాఖ డిప్యూటీ కమిషనర్ కొండల్‌రావు, జనరల్ మేనేజర్ నాగేశ్వరరావుతో కూడిన బృందం కూసుమంచి మండలం పాలేరులోని కొనుగోలు కేంద్రాలు, నేలకొండపల్లి మండలంలోని అరుణాచల రైస్ మిల్లును తనిఖీ చేశారు. నాణ్యమైన ధాన్యమే కొనుగోలు చేయాలని, సీరియల్ ఆధారంగా కాంటా వేయించి ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. ఎండ లేని సమయాల్లోనే కాంటా వేస్తూ, రైతులకు తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్, డీఎం శ్రీలత తదితరులు పాల్గొన్నారు.


