అప్పులు ఉన్నా.. అభివృద్ధి బాట పట్టించాం
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ పార్టీ మితిమీరిన అప్పులు చేసినా.. తాము అధికారంలోకి వచ్చాక అన్నీ సరిదిద్దుతూ అభివృద్ధి బాట పట్టిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాదిన్నరగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కులగణనతో పేద వర్గాలకు రాజ్యాధికారంలో వాటా లభిస్తుందని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు అనుమతి లభించిందనున రానున్న రోజుల్లో 7లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నందున కార్యకర్తలు సన్నద్ధం కావాలని, ఖమ్మం నియోజకవర్గంలో రూ.2,200 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారు. కాగా, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ నిర్వహణలో రఘునాథపాలెం మండలం వెనుకబడినందున అన్ని జీపీల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక క్రమశిక్షణతో మెలగడంతో పాటు మంచి వ్యక్తిత్వం కలిగిన కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈసమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, కమర్తపు మురళి, సాదు రమేష్‌రెడ్డి, ఫాతిమా జోహరా, దొబ్బల సౌజన్య, కొత్తా సీతారాములు, కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
పార్టీ శ్రేణుల సమావేశంలో మంత్రి తుమ్మల


