రిజిస్ట్రేషన్ లేకుండా ఆస్పత్రులు నడపొద్దు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ లేకుండా నడిపితే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి హెచ్చరించారు. డీప్యూటీ డీఎంహెచ్‌ఓ సైదులు, ఎన్‌వీబీడీసీపీ పీఓ వెంకటరమణతో కలిసి శుక్రవారం సురక్ష ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఓపీ, ఐపీ రిజిస్టర్లు చెక్ చేసి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం అపరేషన్ థియేటర్, వార్డులను పరిశీలించారు. పేషెంట్లకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని ఆదేశించారు. తాను మళ్లీ తనిఖీకి వచ్చేనాటికి అన్ని విభాగాలు, రిజిస్టర్లు, ల్యాబ్ పద్ధతి ప్రకారం ఉంచాలని, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో సాంబశివారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ పాల్గొన్నారు.


