తొలిరోజే పుస్తకం.. పాఠం
● జిల్లాకు చేరుతున్న పాఠ్యపుస్తకాలు ● ఇప్పటికే గోదాంలకు చేరిన 2,11,610 పుస్తకాలు
ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ముందుచూపుతో వ్యవహరిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ముగియకముందే వచ్చే ఏడాదికి (2025–26) అవసరమైన పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచుతోంది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు సిద్ధమవుతోంది. 2025 – 26 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండగా తొలిరోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు 1,303 ఉండగా వాటిలో 87,809 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ అవసరమైన పాఠ్య పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు చేరుస్తోంది. జిల్లాలోని పాఠశాలల్లో 6,59,570 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా.. 2,11,610 పాఠ్య పుస్తకాలు ఇప్పటికే వచ్చాయి. మిగతావి త్వరలో రానున్నాయి. అన్నీ రాగానే ఎంఈఓ కార్యాలయాలకు తరలించి, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పుస్తకాల్లోకి కొత్త అంశాలు..
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతంలో స్వల్ప మార్పులు చేసింది. వీటిపై విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా వచ్చే విద్యా సంవత్సరంలో అందించే పాఠ్య పుస్తకాల్లో వీటిని పొందుపరుస్తున్నారు. అలాగే ఈ సారి రాజ్యాంగ పీఠికను సైతం ముద్రించారు.
విద్యార్థులకు ఉపయోగపడేలా..
పాఠశాలల పునః ప్రారంభం రోజునే విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఇది ఎంతగానో ఉపయోగకరమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గతంలో మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి, ఆ తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న క్రమంలో పుస్తకాలు కూడా సకాలంలో అందితే విద్యార్థులు తొలినాళ్ల నుంచే చదువుపై దృష్టి సారించే అవకాశం ఉంది.
పుస్తకాలు వస్తున్నాయి
జిల్లాకు పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ప్రారంభం నుంచే పాఠ్య పుస్తకాలు అందించడం ద్వారా పిల్లలకు చదువుపై మరింత శ్రద్ధ పెరిగే అవకాశం ఉంది. – ఈ.సోమశేఖర శర్మ, డీఈఓ
తొలిరోజే పుస్తకం.. పాఠం


