తరుగు లేకుండా ధాన్యం కొనాలి..
వైరా: వైరా మార్కెట్‌లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ, తరుగు పేరిట జాప్యం చేస్తున్నారంటూ సీపీఐ, సీపీఎం రైతు సంఘాల ఆధ్వర్యాన రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. మార్కెట్ ఎదురుగా వైరా – మధిర ప్రధాన రహదారిపై బైఠాయించడంతో గంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు బాగం హేమంతరావు, సీపీఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు దాటుతున్నా తేమ ఎక్కువగా ఉందని జాప్యం చేస్తుండడమే కాక క్వింటాకు ఐదు కేజీల తరుగు తీస్తున్నారని పేర్కొన్నారు. ఆపై మిల్లులకు పంపించినా మిల్లర్లు సైతం ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కాగా, ధర్నాతో వాహనాలు భారీగా నిలిచిపోగా తహసీల్దార్ కే.వీ.శ్రీనివాస్, ఏఓ మయాన్ మంజుఖాన్, ఎస్‌ఐ వంశీకృష్ణ భాగ్యరాజ్ చేరుకుని రైతులు, నాయకులతో చర్చించారు. జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా వివరించడంతో తరుగు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. నాయకులు దండి సురేష్, సింగు నరసింహారావు, జమ్ముల జితేందర్‌రెడ్డి, తోట రామాంజనేయులు, పోటు కళావతి, భూక్యా వీరభద్రం, ఎం.రామారావు, వెంకటేశ్వరరావు, ఎస్.కే.సైదులు, కె.రవి, బి.నాగేశ్వరరావు, రత్నాకర్, జె.గోపాలరావు, ఎం.మల్లికార్జున్, శ్రీనివాసరావు, హరికృష్ణ, మధు, గోవిందరావు, కొండలరావు, నిర్మల, తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ గేట్‌కు తాళాలు వేసి నిరసన
నేలకొండపల్లి: ధాన్యం తీసుకొచ్చి నెల దాటినా కాంటా వేయకపోగా, కాంటా వేసిన బస్తాలను ఎగుమతి చేయడం లేదని నేలకొండపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ ఆవరణలో డీసీఎంఎస్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం బాధ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మార్కెట్ ప్రధాన గేట్‌కు తాళాలు వేసి అధికారులు, సిబ్బందిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ సమయాన వచ్చిన ఏఓ ఎం.రాధ, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములుకు తమ ఆవేదన వినిపించారు. జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
మిల్లర్లు దించుకోవాల్సిందే...
మిల్లుల సామర్ధ్యం దాటిందని చెబుతూ ధాన్యం దిగుమతి చేసుకోకపోవడం సరికాదని మార్కెట్ చైర్మన్ సీతారాములు పేర్కొన్నారు. రైతువేదికలో మిల్లర్లు, రైతులతో సమావేశం ఏర్పాటుచేయగా ఆయన మాట్లాడారు. ఈసారి ధాన్యం దిగుబడి పెరిగినందున మిల్లర్లు సహకరించాలని సూచించారు. మండలంలో 24 వేల బస్తాలు కాంటాలు వేయగా, మరో 24 వేల బస్తాలు కాంటాలు వేయాల్సి ఉందని.. ఇంకా 37 వేల బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈమేరకు మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవాలన్నారు. తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, ఏఓ ఎం.రాధ, ఆర్‌ఐ నరేష్‌తో పాటు శాఖమూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వైరా మార్కెట్ ఎదుట రాస్తారోకో
తరుగు లేకుండా ధాన్యం కొనాలి..


