ముగిసిన అంతర్ జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
ఏన్కూరు: మండలంలోని గంగుల నాచారంలో మూడు రోజులు జరుగుతున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ పోటీలలో 25 జట్లు పాల్గొనగా, ఏన్కూరు మండలం గంగులనాచారం జట్టు విజేతగా నిలిచింది. ఆతర్వాత స్థానాల్లో సూరారం, గోలిమిల్లు, గంగులనాచారం(బీ), పుఠానీ తండా, చెరువుమాదారం జట్లు నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముక్తి వెంకటేశ్వర్లు, మల్కం గంగులు, పూసం సుధీర్, మల్లేష్, భద్రయ్య, భీమరాజు, గోపాలరావు, వినోద్‌కుమార్, సీతారాములు, వెంకటేశ్వర్లు, శివకృష్ణ, నాగార్జున, సాగర్, దినేష్, నరేష్ పాల్గొన్నారు.
‘కేసీఆర్ మాటల్లో
పసలేదు...’
ఖమ్మంవన్‌టౌన్: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంలో పసలేదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పుల కుప్పగా మార్చడమే కాక ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలుచేయడం సరికాదన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం హేళన చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కార్పొరేటర్ కమర్తపు మురళి, నాయకులు మహ్మద్ జావీద్, పుచ్చకాయల వీరభద్రం, గజ్జి సూర్యనారాయణ, మద్ది వీరారెడ్డి, యాస శ్రీశైలం, రజీభాయ్, ఖైజర్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించండి
తిరుమలాయపాలెం: ప్రకృతి వైద్యం ప్రత్యేకతలను ప్రజలకు వివరిస్తూ మెరుగైన వైద్యం అందించాలని రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రమీలాదేవి సూచించారు. తిరుమలాయపాలెంలోని ప్రకృతి వైద్యశాలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఓపీ సేవలు, రికార్డులను పరిశీలించాక ఉద్యోగులకు సూచనలు చేశారు. డాక్టర్ పి.కనకలక్ష్మి, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ బాబూనాయక్, ఫార్మసిస్టులు పి.నరేష్, వెంకటరాజు పాల్గొన్నారు.
స్వయం ఉపాధి
శిక్షణా సంస్థలో శిక్షణ
ఖమ్మంరూరల్: రూరల్ మండలం వరంగల్ క్రాస్‌లోని రైసెట్ కేంద్రంలో నిరుద్యోగ యువతకు సీసీ టీవీ కెమెరాల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ సి.చంద్రశేఖర్ తెలిపారు. వచ్చేనెల 1నుంచి 13రోజుల పాటు శిక్షణ ఉంటుందని ఆసక్తి ఉన్న వారు కేంద్రంలో కానీ 63014 38045 నంబర్‌లో కానీ సంప్రదించాలని సూచించారు. ఉచిత శిక్షణతో పాటు భోజన, వసతి కల్పించడమే కాక సామగ్రి అందిస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మిర్చి కొనుగోళ్లు పరిశీలన
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లను మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి సోమవారం పరిశీలించారు. కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులతో ఆమె ఇక్కడకు వచ్చినట్లు తెలిసింది. జిల్లాలోని పలు మార్కెట్ల ఉద్యోగులతో కలిసి డీడీ ఖమ్మం మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లను పరిశీలించారు. మిర్చి జెండా పాట, గరిష్ట, కనిష్ట ధరలపై ఆరా తీయడంతో పాటు సీసీఐ పత్తి కొనుగోళ్లలో అక్రమాల వ్యవహారంపై కూడా చర్చించినట్లు సమాచారం.
‘నీట్’ పకడ్బందీగా
నిర్వహించాలి
ఖమ్మంసహకారనగర్: వైద్య కళాశాలల్లో ప్రవేశానికి వచ్చేనెల 4న జరిగే నీట్ పరీక్ష జిల్లాలో పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన అదనపు డీసీపీ ప్రసాదరావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. నీట్ యూజీ ప్రవేశపరీక్షకు 2,739 మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని కేంద్రాలను ఒక రోజు ముందే పరిశీలించాలని, సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించాలని చెప్పారు. వచ్చేనెల 4వ తేదీన మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరగనుండగా, ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1–30గంటలకు విద్యార్థులను అనుమతించి, 1–40 కల్లా పత్రాల తనిఖీ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నీట్ జిల్లా నోడల్ అధికారి నరేంద్రకుమార్, వివిధ శాఖల అధికారులు కె.రాంగోపాల్‌రెడ్డి, డాక్టర్ బి.కళావతిబాయి, రవిబాబు, శ్రీనివాసాచారి, రవికుమార్, రాంప్రసాద్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన అంతర్ జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు


