
‘సీతారామ’ భూసేకరణ పూర్తి చేయండి
అధికారులతో సమీక్షలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మంఅర్బన్: జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకం పనులు యుద్ధప్రాతిపదికన పూర్తయ్యేలా పెండింగ్ భూసేకరణ పూరిచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి నీటిపారుదల, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించాక కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ, అటవీ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి నాటికి యాతాలకుంట ద్వారా నీరు విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఇందుకోసం జిల్లా పరిధిలో 507 ఎకరాల అటవీ భూమికి బదులు ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని తెలిపారు. అలాగే, ప్యాకేజీ–13, 14, 16లో పెండింగ్ పనులపై సమీక్షించారు. ఖమ్మం, కొత్తగూడెం ఎస్‌ఈలు మంగళపుడి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
●ఖమ్మం సహకారనగర్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ సర్వేను జిల్లాలో వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 571 గ్రామాలకు గాను ఇప్పటికే 69 శాతం పూర్తయినందున మిగతాది పూర్తిచేస్తే కేంద్రప్రభుత్వం నుంచి నిధులు మంజూరవుతాయని తెలిపారు. ఫలితంగా మరిన్ని ఇళ్ల నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.
●ప్రణాళికాయుతంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఎస్‌ఆర్) చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఎస్‌ఎస్‌ఆర్‌పై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొన్నారు. 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను మరోసారి ధ్రువీకరించడం తదితర అంశాలపై ఎన్నికల అధికారి సూచనలు చేయగా, జిల్లాలో పనులను కలెక్టర్ వివరించారు. ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, డీఎల్‌పీఓ రాంబాబు, డీటీ అన్సారీ పాల్గొన్నారు.