
బాలత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్‌కు ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించగా, ఆతర్వాత యాగశాలలో శ్రీవారు, అమ్మవార్లకు పూజలు చేశారు. అనంతరం అలివేలు మంగ అమ్మవారిని బాలత్రిపుర సుందరీదేవి అవతారంలో అలంకరించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ముఖ్య అర్చకుడు మురళీమోహన్‌శర్మ పాల్గొన్నారు.
కౌన్సిలర్ల నియామక
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం సహకారనగర్: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాల్లో తరగతులు బోధించడానికి కౌన్సిలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాలలోని అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ బి.వీరన్న తెలిపారు. సంబంధిత పీజీలో 55శాతం మార్కులతో పాటు బోధన అనుభవం, పీహెచ్‌డీ నెట్, సెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు www. braou online. in వెబ్‌సైట్‌లో అక్టోబర్ 10వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
చింతకాని: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా ఉందని, ఎక్కడైనా డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య హెచ్చరించారు. చింతకాని మండలంలోని పలు గ్రామాల్లో పీఏసీఎస్‌లు, ఎరువుల దుకాణాలను మంగళవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. మండలానికి కోటా మేరకు సరఫరా చేస్తున్నందున రైతులకు పంపిణీ చేయాలని, రోజువారీ స్టాక్ వివరాలు వెల్ల డించాలని తెలిపారు. ఈక్రమంలో రైతులకు బిల్లులు ఇవ్వకున్నా, ధరలు పెంచినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు కూడా అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నందున ఆందోళనకు గురికావొద్దని డీఏఓ సూచించారు. ఏఓ మానస, ఏఈఓలు పాల్గొన్నారు.
ట్యాంక్‌బండ్ తరహాలో బౌద్ధక్షేత్రం అభివృద్ధి
నేలకొండపల్లి: దక్షిణ భారతదేశంలోకెల్లా అతి పెద్దదైన మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎల్.రమేష్ తెలిపారు. ఆయన మంగళవారం ఇరిగేషన్ అఽధికారులతో కలిసి బౌద్ధక్షేత్రం, ఆనుకుని ఉన్న చెరువును పరిశీలించి పర్యాటకంగా చేయాల్సిన పనులపై చర్చించారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్ మాదిరి బోటింగ్, వాకింగ్ ట్రాక్, జిమ్, పార్క్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ఆరాతీశారు. ఇరిగేషన్ డీఈఈ మన్మధరావు, జేఈలు మదీనా, రుత్విక్‌తో పాటు పసుమర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బాణసంచా దుకాణాల అనుమతికి దరఖాస్తులు
ఖమ్మంక్రైం: దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటుచేసే వ్యాపారులు ఏసీపీ కార్యాలయాల్లో అక్టోబర్ 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సీపీ నునీల్‌దత్ సూచించారు. మున్సిపల్, అగ్నిమాపక శాఖలు నిర్దేశించిన ప్రదేశాల్లోనే షాప్‌ల ఏర్పాటుకు అనుమతిస్తామని తెలిపారు. దరఖాస్తుతో పాటు ఇతర పత్రాలు, చలానా రశీదు, ఆధార్ కార్డ్, ఫొటో జతపరిచి అందజేయాలని సూచించారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తయారుచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

బాలత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు

బాలత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు