
ప్రపంచానికి తెలిసేలా బౌద్ధక్షేత్రం అభివృద్ధి
నేలకొండపల్లి/ఖమ్మం సహకారనగర్: నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం చరిత్రను ప్రపంచానికి తెలిసేలా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్‌రావు తెలిపారు. బౌద్ధక్షేత్రాన్ని శనివారం పరిశీలించిన ఆయన వివరాలతో కూడిన బోర్డులు తుప్పుపట్టటంతో కొత్తవి ఏర్పాటు చేయాలని, పిచ్చి చెట్లు, మొక్కలను తొలగించాలని ఆదేశించారు. అనంతరం అర్జున్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా నేలకొండపల్లిలోని బౌద్ధస్తూపం పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు చేపట్టామని చెప్పారు. ఇందుకోసం ఆర్కియాలజీ – టూరిజం శాఖల సమన్వయంతో నివేదిక సిద్ధం చేశామని, త్వరలోనే ప్రైవేట్ భాగస్వామ్యంతో గైడ్లను నియమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్లు నర్సింగ్, నాగరాజు, ఏడీ బుజ్జి, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్‌చక్రవర్తి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ అల్లం రవికుమార్, జీపీఓ జానీమియా పాల్గొన్నారు. అనంతరం అధికారులు ఖమ్మంలో కలెక్టర్ అనుదీప్‌ను కలిశారు. ఈసందర్భంగా అభివృద్ధి నివేదికను పరిశీలించిన ఆయన రూ.50లక్షల నిధులతో నెలలోగా కార్యాచరణ మొదలుపెట్టాలని సూచించారు. తవ్వకాల్లో బయటపడిన వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్‌రావు