
కేటీపీఎస్ విస్తరణకు కేంద్రం నుంచి సహకారం
ఎంపీ రఘురాంరెడ్డి లేఖకు
కేంద్ర మంత్రి స్పందన
ఖమ్మంమయూరిసెంటర్: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్( కేటీపీఎస్) మరో రెండు యూనిట్ల విస్తరణ, ఆధునికీకరణకు ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ సహాయమంత్రి శ్రీపాద్‌నాయక్ తెలిపారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆగస్టు 20న ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈమేరకు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌నాయక్ సానుకూలత వ్యక్తం చేస్తూ తాజాగా ఎంపీ రఘురాంరెడ్డికి లేఖ పంపారు. పాత కేటీపీఎస్ స్టేషన్ వద్ద అందుబాటులో ఉన్న స్థలంలో రెండు 800 మెగావాట్ల యూనిట్ల స్థాపనకు నివేదిక సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీజీ జెన్కోకు సూచించగా.. నివేదిక రావాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. టీజీ జెన్కో నిధులు సమకూరుస్తుందని, ఆపై కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను సులభతరం చేయనుండగా, బొగ్గు కేటాయింపునకు సైతం కేంద్రం అవసరమైన మద్దతు ఇస్తుందని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆ లేఖలో తెలిపారని ఎంపీ రఘురాంరెడ్డి వెల్లడించారు.
ట్యాంక్ బండ్‌పై
సందడే సందడి
ఖమ్మం రాపర్తినగర్: ప్రపంచ పర్యాటక శాఖ దినోత్సవ వేడుకలను పర్యాటక శాఖ ఆధ్వర్యాన ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్‌పై శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయగా కళాకారులు తమ ప్రదర్శనలతో హోరెత్తించారు. అంతేకాక మహిళలు బతుకమ్మ ఆడిపాడారు. జిల్లా పర్యాటక శాఖఅధికారి సుమన్ చక్రవర్తి, వివిధ శాఖల అధికారులతో పాటు యువజన సంఘాల బాధ్యులు, స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సింగరేణి(కొత్తగూడెం): గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సింగరేణి వ్యాప్తంగా రోజుకు 90 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతోంది. సంస్థ ఈ ఏడాది 76 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకోగా రోజుకు 1.80లక్షల టన్నుల బొగ్గు వెలికితీయాల్సి ఉంటుంది. కానీ వర్షం కారణంగా 90 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది.