
జిల్లాను వీడని వానలు
● అల్పపీడనం కారణంగా అంతటా వర్షం ● కామేపల్లిలో అత్యధికంగా 50.2 మి.మీ.గా నమోదు
ఖమ్మంవ్యవసాయం: వానాకాలం నుంచి శీతాకాలంలోకి అడుగిడినా వానలు వీడడం లేదు. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నుంచి జిల్లాలో వర్ష ప్రభావం కొనసాగుతుండగా, శుక్రవారం రాత్రి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం కూడా ఆకాశం మేఘావృతమై ఉండి అప్పుడప్పుడు చిరు జల్లులు కురిశాయి. ఎగువన కురిసిన వర్షాలతో నదులు, వాగుల్లో వరద చేరి ప్రవాహం పెరుగుతోంది. మహబూబాబాద్, ములుగు, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో కురిసిన వానతో మున్నేటిలో నీటి మట్టం పెరిగింది. శుక్రవారం ఉదయం 8–30 నుంచి శనివారం ఉదయం 8–30 గంటల వరకు కామేపల్లి మండలంలో అత్యధికంగా 50.2 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే, కారేపల్లిలో 38.2, కల్లూరులో 30.2, ఏన్కూరులో 24, రఘునాథపాలెంలో 15.2, ఖమ్మం రూరల్‌లో 13.4, సత్తుపల్లిలో 12.6, తల్లాడలో 12.4, కొణిజర్లలో 11.4, ఖమ్మం అర్బన్‌లో 10.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
రఘునాథపాలెం/కామేపల్లి: రఘనాథపాలెం మండలంలోని పాపటపల్లి–వీ.ఆర్.బంజర గ్రామాల మధ్య బుగ్గ వాగులోకి భారీగా వరద చేరడంతో ఉప్పొంగింది. వంతెనపై నాలుగు అడుగుల మేర వరద చేరడం ప్రవాహం శనివారం తెల్లవారుజాము నుండి రాత్రి వరకు కొనసాగింది. దీంతో ఖమ్మం– డోర్నకల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ఈ మార్గంలోకి వెళ్లకుండా ఇరువైపులా ట్రాక్టర్లు ఏర్పాటుచేసినట్లు వీ.ఆర్.బంజర పంచాయతీ కార్యదర్శి హిమబిందు తెలిపారు. అలాగే, కామేపల్లి మండలం పొన్నేకల్ బుగ్గవాగుకు వరద భారీగా చేరింది. దీంతో వాగు బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తుండగా లింగాల–డోర్నకల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గరిడేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జిలోకి వరద చేరడంతో రాకపోకలు స్తంభించాయి.

జిల్లాను వీడని వానలు