
ఇక పోటీయే మిగిలింది..
కలెక్టరేట్‌లో డ్రా..
ఎస్టీలకు జెడ్పీ చైర్మన్ పదవి
42 శాతం ప్రకారం బీసీలకు పెరిగిన స్థానాలు జెడ్పీటీసీ, ఎంపీపీల్లో ఎనిమిది చొప్పున కేటాయింపు ఫలితంగా గతంతో పోలిస్తే తగ్గిన జనరల్ స్థానాలు ఎస్టీలకు దక్కనున్న జెడ్పీ చైర్మన్ పీఠం
జిల్లాలో గతంలో, ప్రస్తుతం జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు శనివారం ఖరారయ్యాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయగా గత ఎన్నికలతో పోలిస్తే వారి స్థానాల సంఖ్య పెరిగింది. ఇదే సమయాన జనరల్ స్థానాలు చాలా తగ్గాయి. జిల్లాలోని 20 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఎనిమిది చొప్పున బీసీలకు దక్కాయి. మిగిలినవి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా మిగిలినవి జనరల్‌కు ఖరారయ్యాయి. మొత్తం స్థానాల్లో మహిళలకు పది జెడ్పీటీసీ, తొమ్మిది ఎంపీపీ స్థానాలు రిజర్వు చేశారు.
రిజర్వేషన్ కేటాయింపు ఇలా...
జిల్లాలో 20 మండలాలకు గాను ఐదు ఎంపీపీ స్థానాలు ఎస్టీలకు కేటాయించగా.. ఇందులో రెండు ఎస్టీ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. అలాగే, నాలుగు స్థానాలు ఎస్సీలకు, రెండు ఎస్సీ మహిళలకు కేటాయించారు. ఇక బీసీలకు 8 స్థానాలు రిజర్వు అయ్యాయి. ఇందులో బీసీ మహిళలకు నాలుగు స్థానాలు వచ్చాయి. ఇవిపోగా జనరల్‌కు మూడు కేటాయించగా.. ఒకటి మహిళలకు దక్కింది. జెడ్పీటీసీ స్థానాల్లో నాలుగు ఎస్టీలకు కేటాయించగా.. అందులో రెండు ఎస్టీ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఎస్సీలకు నాలుగు రిజర్వ్ కాగా, అందులో రెండు మహిళలకు వెళ్లాయి. బీసీలకు ఎనిమిది స్థానాలు కేటాయిస్తే అందులో నాలుగు బీసీ మహిళలకు, జనరల్ కేటగిరీలో నాలుగు స్థానాలకు రెండు జనరల్ మహిళలకు రిజర్వ్ అయ్యాయి.
మారిన ముఖచిత్రం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో జిల్లాలో రిజర్వేషన్ల ముఖచిత్రం మారింది. ప్రధానంగా జనరల్ స్థానాలు తగ్గాయి. జెడ్పీటీసీకి సంబంధించి 2019లో పది జనరల్ స్థానాలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య కేవలం నాలుగుకు పరిమితమైంది. గత ఎన్నికల్లో బీసీలకు రెండు స్థానాలే ఉండగా రిజర్వేషన్‌తో ఎనిమిదికి చేరడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు నాలుగేసి స్థానాలు చొప్పున కేటాయించడంతో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఎంపీపీ స్థానాలకు సంబంధించి 2019లో ఎనిమిది జనరల్ స్థానాలు ఉండగా ప్రస్తుతం మూడే దక్కాయి. బీసీలకు గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా లేకపోగా ఈసారి ఎనిమిది స్థానాలు రిజర్వ్ అయ్యాయి. గత ఎన్నికల్లో ఎస్టీలకు ఆరు కేటాయిస్తే ఈసారి ఐదు, ఎస్సీలకు గత ఎన్నికల్లో ఆరు రిజర్వ్ కాగా.. ఈసారి నాలుగు కేటాయించారు.
571 సర్పంచ్, 283 ఎంపీటీసీ స్థానాలు
జిల్లాలో 571 గ్రామపంచాయతీలతో పాటు మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి కూడా రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈమేరకు 571 సర్పంచ్, 283 ఎంపీటీసీల స్థానాల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఆర్‌డీఓ కార్యాలయాల్లో రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. అలాగే, 5,214 వార్డుసభ్యుల స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ మండల స్థాయిలో నిర్వహించారు.
రాఘవాపురం సర్పంచ్ ఏకగ్రీవమే..
సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను అధికారికంగా వెల్లడించకపోయినా... చింతకాని మండలం రాఘవాపురం జీపీ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయినట్లు తెలిసింది. ఇదే జరిగితే సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఎందుకంటే ఈ గ్రామంలో ఒకే ఎస్సీ కుటుంబం ఉండగా.. అందులో మహిళ కాంపల్లి కోటమ్మ మాత్రమే ఉన్నారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా సర్పంచ్ పదవి దక్కించుకోనున్నారు. ప్రస్తుతం కోటమ్మ సీపీఐలో కొనసాగుతున్నారు. కాగా, గత ఎన్నికల్లో రాఘవాపురం సర్పంచ్ స్థానాన్ని జనరల్‌కు రిజర్వ్ చేయగా అంతా కలిసి సీపీఐ నాయకుడు కొండపర్తి గోవిందరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో డ్రా తీశారు. వివిధ రాజకీయ పక్షాల నాయకుల సమక్షాన డ్రా నిర్వహించి రిజర్వేషన్లు ప్రకటించారు. అదనపు కలెక్టర్ శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఆర్‌డీఓ జి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించిన రిజర్వేషన్ ఖరారుకు డ్రా పూర్తికాగా.. ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉంది.
జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, జెడ్పీ చైర్మన్ పదవిని ఈసారి ఎస్టీ జనరల్ కేటగిరీకి కేటాయించారు. ఇరవై జెడ్పీటీసీ స్థానాల్లో కూసుమంచి, కొణిజర్ల స్థానాలు ఎస్టీ జనరల్‌కు, తిరుమలాయపాలెం,
సత్తుపల్లి స్థానాలు ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యాన ఈ నాలుగు స్థానాల నుంచి జెడ్పీటీసీగా గెలిచిన అభ్యర్థికి చైర్మన్ పదవి దక్కనుంది. అయితే, జనరల్ స్థానాల్లోనూ ఎస్టీలకు బరిలోకి దిగే
అవకాశం ఉన్నా జిల్లాలో నాలుగు స్థానాలే ఉండడంతో పోటీ తీవ్రత కారణంగా
ఆ అవకాశం రాకపోవచ్చని భావిస్తున్నారు. కాగా, గత ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ చేయగా.. లింగాల కమల్‌రాజ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు
జెడ్పీటీసీ ఎంపీపీ
స్థానం 2019 2025 2019 2025
కూసుమంచి జనరల్ ఎస్టీ ఎస్టీ బీసీ మహిళ
తిరుమలాయపాలెం జనరల్ ఎస్టీ మహిళ ఎస్టీ ఎస్సీ మహిళ
సత్తుపల్లి జనరల్ ఎస్టీ మహిళ జనరల్ మహిళ ఎస్టీ
కొణిజర్ల జనరల్ ఎస్టీ జనరల్ ఎస్టీ మహిళ
కల్లూరు జనరల్ ఎస్సీ మహిళ ఎస్సీ బీసీ మహిళ
ఎర్రుపాలెం జనరల్ ఎస్సీ ఎస్సీ జనరల్ మహిళ
ముదిగొండ బీసీ మహిళ ఎస్సీ జనరల్ ఎస్సీ
తల్లాడ జనరల్ ఎస్సీ మహిళ జనరల్ ఎస్సీ మహిళ
బోనకల్ ఎస్సీ బీసీ మహిళ ఎస్సీ మహిళ బీసీ
ఖమ్మంరూరల్ జనరల్ బీసీ మహిళ జనరల్ బీసీ
పెనుబల్లి జనరల్ బీసీ మహిళ జనరల్ ఎస్టీ
వైరా ఎస్సీ మహిళ బీసీ ఎస్సీ మహిళ బీసీ
నేలకొండపల్లి జనరల్ బీసీ జనరల్ బీసీ
వేంసూరు ఎస్సీ మహిళ బీసీ ఎస్సీ బీసీ మహిళ
మధిర ఎస్సీ బీసీ మహిళ ఎస్సీ మహిళ బీసీ మహిళ
రఘునాథపాలెం ఎస్టీ మహిళ బీసీ ఎస్టీ మహిళ జనరల్
చింతకాని బీసీ జనరల్ జనరల్ ఎస్సీ
ఏన్కూరు ఎస్టీ మహిళ జనరల్ ఎస్టీ ఎస్టీ మహిళ
కామేపల్లి ఎస్టీ జనరల్ మహిళ ఎస్టీ మహిళ ఎస్టీ
సింగరేణి ఎస్టీ జనరల్ మహిళ ఎస్టీ మహిళ జనరల్

ఇక పోటీయే మిగిలింది..