
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ● అభివృద్ధి పనులకు శంకుస్థాపన
బోనకల్ : అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బోనకల్ మండలం జానకీపురం, నారాయణపురం గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జానకీపురంలో రూ.20లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణపురంలో బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.3.33 కోట్లతో రావినూతల – చిన్నబీరవల్లి బీటీ రోడ్డు పనులకు, తూటికుంట్ల ఎస్సీ కాలనీలో రూ.66 లక్షలతో నిర్మించే అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. చింతకాని మండలంలో రూ.6.95 కోట్లతో నిర్మించే మత్కేపల్లి – తిర్లాపురం రోడ్డు పనులు, నాగిలిగొండ ఎస్సీ కాలనీలో రూ.85 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, పాతర్లపాడు ఎస్సీ కాలనీలో రూ.85 లక్షలతో, కోమట్లగూడెం ఎస్సీ కాలనీలో రూ.70 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, తిమ్మినేనిపాలెం ఎస్సీ కాలనీలో 62 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి పేదల గూడుకు సహకారం అందించామన్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం కోసం రూ.13,500 కోట్లు ఖర్చు అవుతున్నా ప్రభుత్వం వెనుకాడడం లేదన్నారు. మధిర నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని చెప్పారు. అనంతరం గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల వారు కాంగ్రెస్‌లో చేరగా భట్టి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, విద్యుత్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, ఆర్‌అండ్‌బీ ఈఈ తామేశ్వర్, పీఆర్ ఈఈ మహేష్‌బాబు, ఎడీఏ విజయచందర్, డీఎల్‌పీఓ రాంబాబు, గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరావు, మధిర, మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌లు బండారు నరసింహారావు, అంబటి వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షుడు పి.దుర్గాప్రసాద్, నాయకులు దొండపాటి వెంకటేశ్వరరావు, నూతి సత్యనారాయణ, గాలి దుర్గారావు, పైడిపల్లి కిషోర్‌కుమార్, బందం శ్రీను, సుధీర్‌బాబు, బ్రహ్మయ్య, కరివేద సుధాకర్ పాల్గొన్నారు.