
నాలుగు రోజులుగా మున్నేరులో మృతదేహం
● ప్రకాశ్‌నగర్ చప్టా వద్ద సుడిగుండంలో చిక్కుకుపోయిన వైనం ● క్రేన్‌ల సాయంతోనూ వెలికితీయలేని పరిస్థితి ● రెస్క్యూ ఆపరేషన్‌లో పోలీస్, ఫైర్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
ఖమ్మంక్రైం : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌కు చెందిన వ్యక్తి నాలుగు రోజుల క్రితం చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఆకేరులో పడి గల్లంతుయ్యాడు. ఈ మేరకు కుటుంబసభ్యులు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో మున్నేరు ఉధృతి పెరగడంతో గల్లంతైన వ్యక్తి మృతిచెందగా.. ఖమ్మం నగరంలోని ప్రకాశ్‌నగర్ చప్టా వద్ద గల సుడిగుండంలో చిక్కుకుని అక్కడే తిరుగుతున్న మృతదేహాన్ని త్రీటౌన్ పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం నుంచి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నా మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడికి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. దీంతో ఆదివారం ఉదయం త్రీటౌన్ సీఐ మోహన్‌బాబు అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలకు సమాచారం అందించగా వారు కూడా సాయంత్రం వరకు ప్రయత్నించినా మృతదేహం ఉన్న ప్రాంతానికి చేరుకోలేకపోతున్నారు. రెండు పెద్ద క్రేన్ల ద్వారా వెళ్లినా సాధ్యం కాలేదు.
రాత్రంతా అక్కడే కాపలా..
గల్లంతైన వ్యక్తి డోర్నకల్‌కు చెందిన బందెల వెంకటేశ్వర్లు(43)గా పోలీసులు గుర్తించడంతో అతడి భార్య విజయ, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు ఖమ్మంలోని ప్రకాశ్‌నగర్ మున్నేటి ఒడ్డుకు చేరుకుని శనివారం సాయంత్రం నుంచి అక్కడే రోదిస్తూ మృతదేహాన్ని బయటకు తీసుకొస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. కాగా, ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో మృతదేహం ప్రకాశ్‌నగర్ నుంచి కొట్టుకుపోయిందని, అది ఎక్కడ తేలేది తెలియదని సీఐ మోహన్‌బాబు వెల్లడించారు. గల్లంతై నాలుగు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయి ఉందన్నారు. మృతదేహం కొట్టుకుపోయిందని తెలియడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

నాలుగు రోజులుగా మున్నేరులో మృతదేహం