
ఏర్పాట్లు చేయాలి
ఎమ్మెల్సీ ఎన్నికలకు
ఆసిఫాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్దా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉమ్మడి నల్లొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని తెలిపారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. 24 గంటలు, 48 గంటలు, 78 గంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్ట్ అందించాలని తెలిపారు. రాజకీయ పార్టీల హోర్డింగులు, గోడ రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించారు. ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదలవుతుందని, 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, 13లోపు ఉపసంహరణ, ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఫలితాలు ఉంటాయని తెలిపారు. తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని, పెండింగ్‌లో ఉన్న టీచర్లు, పట్టభద్రుల ఓటరు దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 7లోపు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతీ జిల్లాలో ఎంసీఎంసీ కమిటీలు ఏర్పాటు చేసి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రసారాలను పరిశీలించాలని సూచించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ.. జిల్లాలో 6,513 మంది ఓటర్లుండగా, 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఓటరు నమోదు దరఖాస్తులను పరిశీలించి సకాలంలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్ర సీఈవో సుదర్శన్‌రెడ్డి
వీసీలో అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment