ఊరించి.. ఉసూరుమనిపించి..!
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పదేళ్లలో దేశంలో పలు జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగా తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణలోని భద్రాచలం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కౌటాల వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేక, ఇతర కారణాలతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ హైవేను రద్దు చేసింది. దీంతో జిల్లాతో పాటు రాష్ట్రంలో పర్యాటకానికి నష్టం జరగడంతోపాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం దూరమైంది.
కౌటాల: రహదారులు ప్రగతికి చిహ్నాలు..అందుకే ప్రభుత్వాలు ఏవైనా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తుంటాయి. చక్కటి రోడ్లతో జిల్లాల మధ్య అనుసంధానం జరిగితే పర్యాటక, వాణిజ్య, వ్యాపార లావాదేవీలు వృద్ధి చెంది, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం వస్తుంది. అలాగే ఈ ప్రాంతాల్లో నాణ్యమైన రవాణా వ్యవస్థ ఏర్పడడంతో పాటు ఆదాయం పెరుగుతుంది. కానీ తాజాగా భారీ జాతీయ రహదారి విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా హైవే రద్దయ్యింది. రాష్ట్రంలోని జిల్లాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారి ప్రాజెక్ట్ మంజూరై, కన్సల్టెంట్ సర్వే పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు పెండింగులో పడింది. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సరైన పర్యవేక్షణ లేకపోవడంతో దానిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో దాదాపు రూ.8వేల కోట్ల కీలక జాతీయ రహదారి హైవేను కోల్పోయాం.
భద్రాచలం టు కౌటాల...
తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావం తీవ్రంగా ఉండడంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సరైన రోడ్డు రవాణా వ్యవస్థ ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో 2016లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పటి రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం నుంచి గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అనుసంధానిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కౌటాల మండలం వరకు నాలుగు వరుసల రోడ్డును ప్రతిపాదించారు. గోదావరి మీదుగా వంతెన నిర్మాణంతో ఈ రోడ్డును ఛత్తీస్‌గఢ్‌కు కూడా అనుసంధానించే అవకాశం ఉండడంతో కేంద్రం వెంటనే దీనికి సమ్మతించింది. దాదాపు 400 కిలోమీటర్ల నిడివితో దీనిని జాతీయ రహదారిగా చేపట్టేందుకు అంగీకరించి మంజూరు చేసింది. ఈ మేరకు కన్సల్టెన్సీ సంస్థను కూడా నియమించి సర్వే చేయించింది. కానీ కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల్లో సఖ్యత సన్నగిల్లింది. దీంతో కొన్ని జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన క్రమం తప్పకుండా పర్యవేక్షించే చొరవ కూడా మందగించింది. దీంతో కొంతకాలం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టింది.
పర్యాటకానికి ఆటంకం..
హైవే రోడ్డుతో ఆయా ప్రాంతాలు పర్యాటకంగా అ భివృద్ధి చెందుతాయి. రోడ్డు సౌకర్యాలు మెరుగుపడడం వల్ల పర్యాటకులు సులువుగా ప్రయాణించగలుగుతారు. అలాగే ప్రధాన రహదారుల వెంబడి ఆ ర్థిక కారిడార్లు, పారిశ్రామిక సమూహాలు ఏర్పడతా యి. భద్రాచలం నుంచి కౌటాల వరకు హైవే నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో పలు విద్యుదుత్పత్తి, సా గునీటి ప్రాజెక్టులను కూడా ఇది జోడిస్తుండేది. గో దావరి తీరంలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటకులను బాగా ఆకట్టుకునే ప్రాంతా లున్నాయి. వాటన్నింటిని కలుపుతూ ఈ హైవే కొ నసాగడం వల్ల ఆయా ప్రాంతాల్లో పర్యాటకరంగం ఎంతో అభివృద్ధి చెందేది. కానీ రాష్ట్ర ప్రభుత్వ అధి కారులు అటవీ భూముల సమస్యకు సరైన ప్రత్యామ్నాయం చూపుతూ ఢిల్లీ స్థాయిలో ఫాలోఅప్ చేయకపోవడంతో కేంద్రం ఈ రోడ్డును రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి, పర్యాటకానికి, మెరుగైన రవాణా సౌకర్యం చేజారినట్టయింది. దీంతో ప్రభుత్వాల తీరుపై ఆయా ప్రాంతాల ప్రజలు నిరాశ చెందుతున్నారు.
భద్రాచలం – కౌటాల హైవే క్యాన్సిల్
తీవ్రవాద ప్రభావిత ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం
ఇటీవల రద్దు చేస్తూ ఆదేశాలు..
టూరిజం అభివృద్ధిపై ప్రభావం
హైవే రద్దుతో నష్టం
మా ప్రాంతంలో సరైన రోడ్డు సౌకర్యంలేక అనేక ఏళ్లుగా తిప్పలు పడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల క్రితం భద్రాచలం నుంచి కౌటాల వరకు హైవే నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. కానీ అనివార్య కారణాలతో ఇటీవల రద్దు చేయడంతో ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ హైవే రద్దుపై పునరాలోచన చేయాలి.
– మోర్లె పాండురంగ్, కన్నెపల్లి, కౌటాల
నిరాశపడుతున్నాం..
భద్రాచలం నుంచి కౌటాల వరకు పెద్ద రోడ్డు వేస్తారని గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పడంతో చాలా సంతోషించాం. పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుందని ఆశించాం. ఈ రోడ్డు నిర్మిస్తే మారుమూల ప్రాంతాల నుంచి పెద్దపెద్ద పట్టణాలకు సులువుగా వెళ్లేవాళ్లం. కానీ ప్రభుత్వం ఈ రోడ్డును రద్దు చేసిందని తెలిసి నిరాశ పడుతున్నాం.
– సిడాం దౌలత్, వీర్ధండి, కౌటాల
ఆగిన హైవే..
రాష్ట్రంలోని గోదావరి పరీవాహక జాతీయ రహదారి ప్రాజెక్టు పేరిట భద్రాచలం–సారపాక–ఏటూరు నాగారం–కాళేశ్వరం–చెన్నూర్–కౌటాల మీదుగా ఈ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను అనుసంధానిస్తూ సాగాల్సి ఉంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో భద్రచాలం–కౌటాల రోడ్డు నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపిందన్న విమర్శలున్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో అటవీ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మించాల్సి రావడంతో అటవీ భూముల సేకరణ ఇబ్బందిగా మారుతుందని, వన్యప్రాణులకు సమస్యలేర్పడుతాయన్న భావన వ్యక్తమైంది. ఎన్నికలకు ముందు కొన్ని పెండింగ్ ప్రాజెక్టులను సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం వాటిల్లో కొన్నింటిని రద్దు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా భద్రాచలం నుంచి కౌటాల వరకు హైవే జాతీయ రహదారిని ఇటీవల రద్దు చేసింది. ఈ హైవే నిర్మాణంతో ఆయా ప్రాంతాలు అన్ని రంగాల్లో వృద్ధి చెందుతాయని భావించిన ప్రజలకు నిరాశ తప్పలేదు. మరో వైపు కేంద్రం ఈ హైవేను రద్దు చేయడంతో ఆయా ప్రాంతాల్లోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది.
ఊరించి.. ఉసూరుమనిపించి..!
ఊరించి.. ఉసూరుమనిపించి..!
Comments
Please login to add a commentAdd a comment