అంగన్‌వాడీ కొలువులు..!
● ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు.. ● మార్చి 8న మహిళా దినోత్సవం రోజున నోటిఫికేషన్? ● టీచర్‌లు 126, ఆయాలు 397, సూపర్‌వైజర్‌లు 20, సీడీపీవో 2 ఖాళీలు
దహెగాం: గ్రామాల్లో ఆటాపాటలతో చిన్నారులను పాఠశాలకు అలవాటు చేయడం, గర్భిణులు, బా లింతలకు పోషకాహారం అందించడానికి ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉండడంతో సరైన పోషకాహారం అందడంలేదు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సరిగా లేకపోవడం, వెక్కిరిస్తున్న ఖాళీలపై పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయా కేంద్రాల్లో ఖాళీ గా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల ను భర్తీ చేయడానికి మార్చి 8న మహిళా దినో త్సవం రోజున నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. దీంతో ఆయా పోస్టులకు మోక్షం కలుగనుంది. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ మెరుగుపడనుంది.
జిల్లాలో 973 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో ఐసీడీఎస్ కింద 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 40,812 మంది చిన్నారులు, 4,668 మంది గర్భిణులు, 3,502 మంది బాలింతలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తుంటారు. కానీ ఆయా కేంద్రాల్లో ఏళ్లతరబడిగా ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయక పోవడంతో కొన్ని చోట్ల కేంద్రాలు తెరుచుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్ పోస్టులు 126, ఆయా పోస్టులు 397 ఖాళీలు ఉండడంతో పౌష్టికాహారం అందని ద్రాక్షగానే మిగిలింది. 126 అంగన్‌వాడీ టీచర్ పోస్టుల్లో ఏజెన్సీలో 81, నాన్ ఏజెన్సీలో 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల్లో ఏజెన్సీలో 230, నాన్ ఏజెన్సీలో 167 ఖాళీలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించే అధికారుల పోస్టులు సైతం భారీగానే ఖాళీ ఉన్నాయి. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడింది. అంతేకాకుండా ఆసిఫాబాద్, వాంకిడి ప్రాజెక్టుల్లో రెండు సీడీపీవో పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ప్రతీ క్లస్టర్‌లో ఒక సూపర్ వైజర్ ఉండాలని నిబంధన ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా 40 సూపర్ వైజర్ పోస్టులకుగానూ 20 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించే వారు కరువయ్యారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించడంతో ఖాళీలకు మోక్షం కలగనుంది. ఖాళీలను స్థానికులతో భర్తీ చేయాలని డిమాండ్ ఉంది.
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయా పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. కార్యకర్తల పోస్టులు 126, ఆయా పోస్టులు 397, సూపర్‌వైజర్ పోస్టులు 20, సీడీపీవో పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి.
– భాస్కర్, ఐసీడీఎస్ పీడీ
జిల్లాలో క్లస్టర్ వారీగా ఖాళీల వివరాలు
క్లస్టర్ అంగన్‌వాడీ ఆయాలు
టీచర్లు
సిర్పూర్(టి) 9 52
జైనూర్ 38 117
ఆసిఫాబాద్ 30 112
కాగజ్‌నగర్ 9 45
వాంకిడి 40 71
మొత్తం 126 397
అంగన్‌వాడీ కొలువులు..!
Comments
Please login to add a commentAdd a comment