● ఆలస్యమవుతున్న ఏర్పాటు ప్రక్రియ ● స్జేట్– 1 అనుమతుల కోసం నిరీక్షణ ● అక్టోబర్ దాటితే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సిందే.. ● ఓపెన్ కాస్టు కోసం కార్మికులు, ప్రజల ఎదురుచూపు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఒకప్పుడు బొగ్గు గనులు, వేలాది మంది కార్మికులతో కళకళలాడిన బెల్లంపల్లి ఏరియా ప్రస్తుతం ఒకేఒక్క ఓసీపీ(ఓపెన్ కాస్టు ప్రాజెక్టు)తో కాలాన్ని వెల్లదీస్తోంది. ఏరియాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రస్తుతం ఉన్న కై రిగూడ ఓసీపీ జీవితకాలం మరో మూడేళ్లలో పూర్తి కానుండటంతో ఏరియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. ఆ లోపే ఏరియాకు పునర్జీవం అందించేలా గోలేటి, ఎంవీకే ఓసీపీలను ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే అనుమతులు సకాలంలో అందకపోవడంతో గోలేటి ఓసీపీ ఏర్పా టు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఐదేళ్ల క్రిత మే ప్రక్రియ ప్రారంభించినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అనుమతులు రాలేదు. ఏరియా అధికారులు మాత్రం ఓసీపీ ఏర్పాటుపై ఊరిస్తూనే ఉన్నారు.
15 ఏళ్ల జీవిత కాలంతో..
బెల్లంపల్లి ఏరియాలో ప్రస్తుతం కై రిగూడ ఓసీపీ ఒక్కటే కొనసాగుతోంది. ఇక్కడ మరో 10 మిలియన్ టన్నుల వరకు మాత్రమే బొగ్గు నిల్వలు ఉండగా.. మరో మూడేళ్లపాటు ఈ ఓసీపీ నడుస్తుంది. ఆ లోపే గోలేటి ఓసీపీని ఏర్పాటు చేయాలని అధికారులు ముందుకు సాగుతున్నారు. సుమారు రూ.220 కోట్ల నిధులు గోలేటి ఓసీపీ కోసం ఖర్చు చేయనున్నారు. ఏరియాలో మూసివేసిన గోలేటి– 1, గోలేటి– 1ఏ భూగర్భ గనులు, బీపీఏ ఓసీపీ– 2 ఎక్స్‌టెన్షన్, అబ్బాపూర్ ఓసీపీ భూభాగాన్ని కలుపుకుని గోలేటి ఓసీపీని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. గోలేటి ఓసీపీ ద్వారా 15 ఏళ్లపాటు నిరాటకంగా బొగ్గు ఉత్పత్తి చేపట్టవచ్చని యాజమాన్యం అంచనా వేయగా.. 36 మిలియన్ టన్నుల వరకు నిక్షేపాలు అందుబాటులో ఉన్నాయి. గోలేటి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ మొదలు కాగానే.. ఎంవీకే ఓసీపీ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఎంవీకే ఓసీపీ జీవిత కాలం సుమారు 20 ఏళ్లు ఉంటుందని అంచనా. గోలేటి ఓసీపీతోపాటు ఎంవీకే ఓసీపీ అందుబాటులోకి వస్తే బెల్లంపల్లి ఏరియా పూర్వ వైభవం రావడం ఖాయం.
1,358.280 హెక్టార్లలో..
కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గోలేటి ఓసీపీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు 1,358.280 హెక్టార్ల భూభాగం అవసరం ఉండగా గోలేటి– 1, గోలేటి– 1ఏ, అబ్బాపూర్ ఓసీపీ, బీపీఏ ఓసీపీ– 2 ఎక్స్‌టెన్షన్‌ల కోసం గతంలో సేకరించిన 594.071 హెక్టార్ల భూమి ప్రస్తుతం సింగరేణి అధీనంలో ఉంది. మిగిలిన 665.914 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. ఇందులో 59 ఎకరాల మాత్రమే ప్రైవేటు భూమి ఉంది. మిగిలినదంతా అటవీశాఖకు చెందినది కావడంతో భూసేకరణ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ప్రైవేటు భూమి సేకరణ ప్రక్రియ కలెక్టరేట్ పరిధిలో ఉండగా త్వరలో అవార్డు కానుంది. మిగిలిన అటవీశాఖ భూసేకరణకు సంబంధించిన స్టేజ్– 1, స్టేజ్– 2 అనుమతులతోపాటు పర్యావరణ అనుమతులు రాగానే ఓసీపీ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే 2026లో గోలేటి ఓసీపీ ద్వారా ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఏడాది నుంచి బొగ్గు ఉత్పత్తి
బెల్లంపల్లి ఏరియాలో నూతనంగా ప్రారంభించనున్న గోలేటి ఓసీపీ ద్వారా వచ్చే ఏడాది నుంచి బొగ్గు ఉత్పత్తి చేపట్టాలనే చూస్తున్నాం. అనుమతులు కోసం ప్రయత్నిస్తున్నాం. వచ్చే నెలలో స్టేజ్– 1 అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్విరాన్‌మెంట్, స్టేజ్– 2 అనుమతుల కోసం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాం. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఏడాది నుంచి గోలేటి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి మొదలువుతుంది. ఆ తర్వాత కొన్నేళ్లకే ఎంవీకే ఓసీపీ సైతం ఏర్పాటు అవుతుంది.
– విజయభాస్కర్‌రెడ్డి, బెల్లంపల్లి ఏరియా జీఎం
స్టేజ్ 1 అనుమతులపైనే ఆశలన్నీ..
బెల్లంపల్లి ఏరియా భవిష్యత్ ఆశాదీపంగా భావిస్తున్న గోలేటి ఓసీపీకి ఇప్పటివరకు స్టేజ్–1 అనుమతులు కూడా రాకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. కొన్నేళ్లుగా స్టేజ్– 1 అనుమతులు కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్టు అధికారులకు దరఖాస్తు చేసుకున్నా కిందిస్థాయి నుంచి కేంద్రం వరకు ఒక్కోస్థాయిలో జాప్యం జరుగుతోంది. ఎట్టకేలకు స్టేజ్– 1 అనుమతులకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్ వద్దకు చేరింది. వచ్చే నెలలో ఈ అనుమతులు వచ్చే అవశాశం ఉందని ఏరియా అధికారులు భావిస్తున్నారు. అనుమతులు రాగానే పర్యావరణ అనుమతులతో పాటు స్టేజ్– 2 అనుమతులు సాధించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే గోలేటి ఓసీపీ కోసం యాజమాన్యం 2022 అక్టోబర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఒకసారి ప్రజాభిప్రాయ పూర్తయిన తర్వాత మూడేళ్లలోపు ప్రాజెక్టు ప్రారంభించని పక్షంలో మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉంటుంది. దీంతో వచ్చే అక్టోబర్ లోగా స్టేజ్– 1 అనుమతులతోపాటు పర్యావరణ అనుమతులు సైతం సాధించేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
ఊరిస్తున్న గోలేటి ఓసీపీ
ఊరిస్తున్న గోలేటి ఓసీపీ


