జవాబుదారీతనంతో పనులు చేయించాలి
● డీఆర్‌డీవో దత్తారావు
రెబ్బెన(ఆసిఫాబాద్): జవాబుదారీతనంతో ఉపాధిహామీ పనులు చేయించాలని డీఆర్‌డీవో దత్తారావు అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ ఆవరణలో బుధవారం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఉపాధిహామీ సామాజిక తనిఖీల్లో గుర్తించిన అంశాలను ప్రజావేదిక ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మండలంలో ఈజీఎస్‌లో భాగంగా 371 పనులు చేపట్టగా.. కూలీల వేతనాల రూపంలో రూ.3.47 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.20.27 లక్షలు చెల్లించినట్లు తనిఖీ బృందం సభ్యులు తెలిపారు. పంచాయతీరాజ్ ద్వారా 78 పనులు చేపట్టగా కూలీల వేతనాలకు రూ.14.29 వేలు, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.1.58 కోట్ల చెల్లించినట్లు గుర్తించామని వెల్లడించారు. పంచాయతీల వారీగా చేపట్టిన పనుల వివరాలను తనిఖీ బృందం వివరించగా.. చాలాచోట్ల ఈజీఎస్ సిబ్బంది పూర్తిస్థాయిలో రికార్డులు నమోదు చేయకపోవడంపై డీఆర్‌డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల వివరాలను తెలిపే బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, కొలతల్లో తేడాల కారణంగా కూలీలు నష్టపోవడం వంటి అంశాలు తనిఖీలో బయటపడినట్లు సభ్యులు తెలిపారు. బీపీఎంలు కూలీలకు చెల్లించాల్సిన డబ్బులను నెలల తరబడి వారి వద్దే ఉంచుకుంటున్నట్లు గుర్తించామని తెలపడంతో.. బీపీఎంలకు షాకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్‌డీవో ఆదేశించారు. కై రిగాంలో పంచాయతీలో చేపట్టిన పనులకు సంబంధించి పత్రాలపై ఏపీవో సంతకాలు లేకుండానే రూ.2లక్షల వేతనాలను కూలీలకు చెల్లించారని తెలిపారు. దానికి ఆపరేటర్ బాధ్యత వహించి కూలీలకు చెల్లించిన మొత్తాన్ని ఆయన ద్వారా రికవరీ చేయాలని డీఆర్‌డీవో ఆదేశించారు. పని ప్రదేశాల్లో నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపట్టని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు శంకరమ్మ, శ్రీనివాస్, హెచ్‌ఆర్ మేనేజర్ మల్లేశ్, హ్యూమన్ రిసోర్స్‌పర్సన్ రజినీకాంత్, క్వాలిటీ కంట్రోల్ అధికారి రమేశ్, ఏపీవోలు రామ్మోహన్‌రావు, బుచ్చన్న, ఎస్‌ఆర్పీ తిరుపతి, ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


