● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌అర్బన్: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన సీసీ రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణాలు ఈ నెల 30లోపు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి, డీఆర్‌డీవో దత్తారావు, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్‌రావుతో కలిసి గురువారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగింపునకు కేవలం నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని, ఉపాధిహామీ కింద చేపట్టిన పనులు పూర్తి చేయాలన్నారు. ఎంబీ రికార్డులు సమర్పించాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించేవిధంగా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో ఇంజినీరింగ్‌శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్‌తో కలిసి మహిళా సంఘాలకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు అప్పగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల యూనిఫాంలు కుట్టే పనిని వారికి అప్పగించి.. జూన్ 12లోగా పాఠశాలలు చేరేలా చర్యలు చేపడతామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్, డీఆర్‌డీవో దత్తారావు తదితరులు పాల్గొన్నారు.


