చిరస్థాయిగా గణపతి శర్మ సాహితీ సేవలు
కాగజ్‌నగర్‌రూరల్: ప్రఖ్యాత కవి, రచయిత గట్టు గణపతిశర్మ సాహితీ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రచయిత సామల రాజ వర్ధన్ ప్రశంసించారు. పట్టణంలోని పద్మశాలి భవన్‌లో ఆదివారం డాక్టర్ సామల సదాశివ సాహితీ పురస్కారం– 2024 ప్రదానోత్సవం నిర్వహించారు. అనంతరం గణపతి శర్మ రచించిన విరాటపర్వం ద్విపద కావ్యాన్ని డాక్టర్ ఎంవీ పట్వర్ధన్ ఆవిష్కరించారు. తేలు శ్రీలత రచించిన నీలవేణి శతకాన్ని డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, కవి పండితుడు కొమేర రాజేశ్వర్‌రావు రచించిన సీతా చరితం గ్రంథాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనరసింహం ఆవిష్కరించారు. ఇటీవల మృతి చెందిన తెలుగు సాహిత్య అధ్యక్షుడు లక్ష్మిరాజయ్య మృతికి సంతాపంగా రెండు నిమిషాల మౌనం పాటించి సంతాపం తెలిపారు. రచయిత కిషన్‌శర్మ, తెలుగు సాహి తీ క్రియాశీలక కార్యదర్శి కటుకం మధుకర్, తిరుపతయ్య, శ్యాంసుందర్, ఎంఈవోలు ప్రభాకర్, రమేశ్, వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ పాల్గొన్నారు.


