పోడు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
బెజ్జూర్(సిర్పూర్): సిర్పూర్ నియోజకవర్గంలోని పోడు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని చిన్నసిద్దాపూర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ రైతులు వారి సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్లుగా భూములు సాగు చేస్తున్నామని, 2017లో భూప్రక్షాళన సర్వేలో ప్రభుత్వం అసైన్డ్ పట్టా పాస్‌పుస్తకాల వివరాలు నమోదు చేసిందని తెలిపారు. ఇప్పటివరకు పాస్‌బుక్‌లు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులు పాస్ పుస్తకాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, అటవీ శాఖలు ఉమ్మడి సర్వే చేసి, పట్టాలు జారీ చేయాలని కోరారు. సీసీ రోడ్లు మంజూరు చేయాలని విన్నవించారు. అనంతరం మండల కేంద్రంతోపాటు కృష్ణపల్లి, సలుగుపల్లి గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులకు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ భూమేశ్వర్, ఎస్సై ప్రవీణ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ ఓంప్రకాష్, మాజీ జెడ్పీటీసీ పంద్రం పుష్పలత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్ధన్, మండల అధ్యక్షుడు బుస శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజారాం, టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్, మాజీ సర్పంచులు కొండ్ర జగ్గాగౌడ్, లింగయ్య, విశ్వేశ్వర్, ఉమామహేశ్, సురేశ్‌గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


