‘స్థానిక ఉద్యోగులపై వివక్ష’
కాగజ్‌నగర్‌రూరల్: సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) యాజమాన్యం స్థానిక కార్మికులపై వివక్ష చూపుతోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్థానికేతర కార్మికుల కంటే స్థానికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్– 14 సమానత్వపు హక్కుకు వ్యతిరేకమని తెలి పారు. పని ఒక్కటే అయినప్పుడు జీతాలు వేర్వేరుగా ఎందుకుంటాయని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే మిల్లు పునఃప్రారంభానికి కృషి చేశారని గుర్తుచేశారు. మిల్లు ఆవరణలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికుల సెలవులు తగ్గించారని, డెవిడెంట్ రావ డం లేదని, పిల్లలకు రావాల్సిన నోట్‌బుక్స్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రానున్న మిల్లు యూనియన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కార్మికుల పక్షాన నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఈ నెల 15న పేపర్‌మిల్లు కార్మికుల సమక్షంలో మేధోమథన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, మోయిన్, అంబాల ఓదెలు, గోగర్ల కన్నయ్య, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


