● కులగణన పూర్తయి ఐదు నెలలైనా అందని గౌరవ వేతనం ● ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, ఆపరేటర్లకు తప్పని ఎదురుచూపులు ● జిల్లాలో 1,61,901 కుటుంబాల వివరాలు సేకరణ
వాంకిడి(ఆసిఫాబాద్): సమగ్ర సర్వే ముగిసి ఐదు నెలలు కావొస్తున్నా.. విధులు నిర్వర్తించిన సిబ్బంది ఖాతాల్లో ఇప్పటివరకు వేతనం జమ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణ నలో వివరాలు సేకరించిన వారు గౌరవ వేతనం కోసం ఎదురుచూస్తున్నారు. సర్వే అనంతరం ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతీఒక్కరికి గౌరవ వేతనం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నెలలు గడుస్తున్నా డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో సర్వే చేసిన ఎన్యూమరేటర్లు, పరిశీలన జరిపిన సూపర్‌వైజర్లు, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన కంప్యూటర్ ఆపరేటర్లకు నిరీక్షణ తప్పడం లేదు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణనను రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ మొదటి వారంలో ప్రారంభించి అదే నెలలో పూర్తి చేసింది. సిబ్బంది ఇంటింటా తిరిగి స్టిక్కర్లు అతికించారు. అనంతరం కుంటుంబాల వారీగా వివరాలు సేకరించారు. ఈ ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శులు, పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిసోర్స్ పర్సన్లు ఇతర సిబ్బంది భాగస్వాములయ్యారు. సర్వేను పరిశీలించేందుకు ఎంపీడీవో స్థాయి అధికారులను నోడల్ అధికారులగా నియమించారు.
1,61,901 కుటుంబాల సర్వే..
జిల్లాలో కాగజ్‌నగర్‌తోపాటు నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్‌తో కలిపి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. 15 మండలాల్లో 335 గ్రామ పంచాయతీలు ఉండగా 5,15,812 జనాభా ఉంది. జిల్లాలో 1292 మంది ఎన్యూమరేటర్లు, 153 మంది సూపర్‌వైజర్లు 1,61,901 కుటుంబాలను సర్వే చేశారు. ఒక్కొక్క ఎన్యూమరేటర్ 150 కుటుంబాల చొప్పున కేటాయించగా సర్వే విజయవంతంగా పూర్తిచేశారు. 1,61,901 కుటుంబాలకు చెందిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ పరిస్థితులతో పాటు కులం వివరాలు సేకరించారు. ఒక్కొక్క కుటుంబానికి 8 పేజీలతో కూడిన ఫారం ఉండగా అందులో మొత్తం 75 రకాల ప్రశ్నలు ఉన్నాయి. సర్వే సమయంలో ఎన్యూరేటర్లు ఓపికతో కుటుంబ సబ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఇంటింటికి తిరుగుతూ సేకరించిన సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల కంపూటర్ ఆపరేటర్లతో పాటు ప్రైవేటు సిబ్బందిని కూడా నియమించారు.
నిధుల కొరతే కారణమా.?
జిల్లాలో సర్వే నిర్వహించిన వారికి భత్యం చెల్లించడానికి దాదాపు రూ.2 కోట్ల నిధులు అవసరం అవుతాయి. జిల్లా ప్లానింగ్ కార్యాలయం ద్వారా సర్వేలో పాల్గొన్న వారికి భత్యం జమ చేసేందుకు ఏర్పాట్లు సైతం చేశారు. ఖాతాల నంబర్లు సేకరించి నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్కరికి కూడా నయాపైసా రాలేదు. జిల్లా ప్లానింగ్ అధికారులను అడిగితే ట్రెజ రీకి బిల్లులు పంపించామని, ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే సొమ్ము జమ అవుతుందని చెబు తున్నారు. ఆర్థికశాఖ వద్ద నిధుల కొరత తీవ్రంగా ఉండటంతోనే టోకెన్లు జారీ చేసినా డబ్బులు జమ కావడం లేదని తెలుస్తోంది. సమగ్ర సర్వే భత్యం డబ్బులు చెల్లించాలని సిబ్బంది కోరుతున్నారు.
ఐదు నెలలుగా నిరీక్షణ..
సర్వే సిబ్బంది కొన్నినెలలుగా గౌరవ వేతనం కోసం నిరీక్షిస్తున్నారు. సర్వే కొనసాగుతున్న సమయంలోనే ఎన్యూమరేటర్లకు రూ.10 వేలు, సూపర్‌వైజర్లకు రూ.12 వేలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కొక్క ఫారానికి రూ.30 చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాలో సర్వే నిర్వహించిన న్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు దాదాపుగా రూ.1.50 కోట్ల నిధులు అవసరమవుతాయి. అలాగే జిల్లావ్యాప్తంగా డేటా ఎంట్రీ చేసిన కంప్యూటర్ ఆపరేటర్లకు మరో రూ.50 లక్షల వరకు చెల్లించాలి. సర్వే విధుల్లో పాల్గొన్న సిబ్బంది తమ బ్యాంకు ఖాతా వివరాలను అప్పట్లోనే అధికారులకు అందజేశారు. నాటి నుంచి డబ్బులు వస్తాయని ఎదురుచూస్తున్నా ఇప్పటివరకు ఖాతాల్లో జమ కాలేదు. ఉన్నతాధికారులు దృష్టి సారించి త్వరగా డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని వారు కోరుతున్నారు.
డబ్బులు చెల్లించాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేకు సంబంధించిన ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. డాటా ఎంట్రీ ప్రక్రియ పూర్తయి ఐదు నెలలు గడిచింది. కానీ ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదు. అధికారుల సూచనల మేరకు రాత్రిపూట కూడా కష్టపడి పనిచేశాం. ఉన్నతాధికారులు స్పందించి డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి.
– పైశెట్టి వేణు, ప్రైవేటు డాటా ఎంట్రీ ఆపరేటర్
బాధ్యతగా పని చేశారు
ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరిస్తూ సమగ్ర సర్వేలో ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేశారు. సెలవు దినాల్లోనూ సర్వే నిర్వహించి రిపోర్టును ప్రభుత్వానికి నివేదించారు. కానీ గౌరవ వేతనం ఇప్పటివరకు ఖాతాల్లో జమ కాలేదు. కాలాయాపన చేయకుండా వెంటనే విడుదల చేయాలి. – శాంతి కుమారి,
టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు
సర్వే వేతనాలేవి..?
సర్వే వేతనాలేవి..?
సర్వే వేతనాలేవి..?


