హక్కుల రక్షణకు శిక్షణ
● జోడేఘాట్‌లో నేటి నుంచి తుడుందెబ్బ రాష్ట్ర మహాసభలు ● మూడు రోజులపాటు శిక్షణ తరగతులు ● పాత, కొత్త చట్టాలపై అవగాహన ● హాజరుకానున్న ప్రొఫెసర్లు కోదండరాం, ఖాసీం
ఏళ్లుగా పోరాటం
ఆదివాసీల ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేర్చడమే ఏజెండాగా.. అస్తిత్వంతోపాటు హక్కుల రక్షణ కోసం తుడుందెబ్బ సంఘం ఏళ్లుగా పోరాటం సాగిస్తోంది. నాయకత్వ నిర్మాణంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూ నిర్బంధాలను దాటి లక్ష్య సాధన కోసం ఉద్యమిస్తోంది. ఓ వైపు ఆదివాసీల రక్షణకు పోరాడుతూనే మరోవైపు దళిత, బహజన, శ్రామిక వర్గాల హక్కులు, సీ్త్ర హక్కుల కోసం ఉద్యమించే ప్రజా సంఘాలకు మద్దతుగా నిలుస్తోంది.
కెరమెరి(ఆసిఫాబాద్): ఆదివాసీ చట్టాలు, హక్కుల రక్షణకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) నడుం బిగించింది. ఈ నెల 12 నుంచి మూడు రోజులపాటు కెరమెరి మండలం జోడేఘాట్‌లోని కుమురంభీం మ్యూజియంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా, మండలాల స్థాయిలో పనిచేసే యువ సభ్యులు దాదాపు 200 మందికి శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్లు కోదండరాం, ఖాసీం హాజరు కానున్నారు. తుడుందెబ్బ ఆవిర్భవించి 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు.
ఆదివాసీ చట్టాల అమలేది..?
ప్రత్యేక రాష్ట్రంలోనూ ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు. హక్కులు, చట్టాల అమలుపై చిత్తశుద్ధి కరువైందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నేటికీ వారి జీవితాల్లో మార్పు కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ద్వారా ప్రత్యేక రుణాలు, ఉద్యోగాల కల్పన తదితర కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టారు. అయితే ప్రత్యేక రాష్ట్రంలో ఐటీడీఏను పట్టించుకోవడం లేదని ఆదివాసీలు చెబుతున్నారు. మరోవైపు గిరిజన హక్కులపై దాడి పెరగడంపై సర్వత్రా ఆందోళన మొదలైంది. ఉద్యోగ అవకాశాలు కల్పించే షెడ్యూల్డ్ ప్రాంత జీవోలు మసకబారి పోయాయి. మైదాన ప్రాంతాల కోసం రూపొందించే జనరల్ పరిపాలన అధికారాలను ఏజెన్సీ ప్రాంతాల్లోనూ అమలు చేస్తున్నారు. వందశాతం గిరిజనులకే ఉద్యోగాలు కల్పించే జీవో 3తోపాటు పెసా, 1/70 చట్టాలు నిర్వీర్యం అవుతున్నాయి. ఈ నెల 12, 13, 14 తేదీల్లో కొత్త, పాత చట్టాలపై తుడుందెబ్బ సంఘం సభ్యులకు శిక్షణ అందించనున్నారు. వీరు గ్రామాల్లో ప్రజలకు వివరించనున్నారు.
ఉద్యమ కార్యాచరణ
ఆదివాసీల హక్కులు, చట్టాల రక్షణకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆదివాసీలు నష్టపోతున్నా పాలకులు ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. ఆదివాసీలకు చట్టాలపై అవగాహన కల్పిస్తాం. గ్రామస్థాయిలో తుడుందెబ్బను బలోపేతం చేస్తాం.
– కోవ విజయ్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు


