ఆ రైలు 20గంటలు ఖాళీ..!
● నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైలు కాజీపేట జంక్షన్ వరకు పొడగిస్తే మేలు ● ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రయాణికులకు రవాణా సౌకర్యం ● ఎంపీలు స్పందించాలని రైల్వే ప్రయాణికుల విజ్ఞప్తి
బెల్లంపల్లి: ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బల్లార్షా వరకు నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైలు(నం.11001/2) వయా నాందేడ్, ఆదిలాబాద్ మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తోంది. ప్రస్తుతం ఈ రైలును వరంగల్ జిల్లా కాజీపేట జంక్షన్ వరకు పొడగించాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. ఉత్తర తెలంగాణ ప్రజలు మహారాష్ట్ర రాజ ధాని ముంబయి వెళ్లడానికి సరైన రైలు ప్రయాణ సౌకర్యం లేకుండా పోయింది. కాజీపేట, హైదరా బాద్ వెళ్తే గానీ ముంబయికి వెళ్లే పరిస్థితులు లేవు. ప్రస్తుతం ముంబయి నుంచి బల్లార్షా జంక్షన్ వరకు నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. ఆ రైలును కాజీపేట జంక్షన్ వరకు పొడగించడం వల్ల రైల్వేపై ఏ మాత్రం భారం పడకపోగా ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని ప్రయాణికులకు ఎంతగానో మేలు జరిగి రవాణా సౌకర్యం మెరుగవుతుంది.
సమయం సద్వినియోగం చేసుకుంటే..
ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బయల్దేరిన నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైలు వయా నాందేడ్, ఆదిలాబాద్ మీదుగా బల్లార్షా జంక్షన్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత అక్కడే దాదాపు 20గంటలపాటు ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాజీపేట జంక్షన్ వరకు పొడగిస్తే కాజీపేట–బల్లార్షా సెక్షన్ పరిధిలో ఉన్న సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట తదితర ప్రాంతాల ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉండడంతోపాటు రైల్వేకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల ప్రజలకు ముంబయి వెళ్లడానికి ఒక్క రైలు సౌకర్యం కూడా లేదు. దీంతో ముంబయి వెళ్లాల్సిన ప్రయాణికులు కాజీపేట జంక్షన్‌కు వెళ్లి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ లేదా విశాఖ నుంచి ఎల్‌టీటీ ద్వారా వెళ్లాల్సి వస్తోంది. అదీ సాధ్యం కాకపోతే నిజామాబాద్ జంక్షన్‌కు వెళ్లి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ముంబయి వెళ్లాల్సిన ప్రతికూల పరిస్థితులు ఉంటున్నాయి. నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట జంక్షన్ వరకు పొడగించిన తర్వాత కూడా మరో 11గంటలపాటు రైలు ఖాళీగా ఉండే అవకాశాలు ఉండనున్నాయి. అక్కడ ప్రాథమిక నిర్వహణకు అవకాశం ఉంటుంది. ప్రసుత్తం కాజీపేటలో రెండు ఫిట్‌లైన్లు అందుబాటులో ఉండడం కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. కాగా, ఆదిలాబాద్ జిల్లా ప్రయాణికులకు వరంగల్ జిల్లా మరింత చేరువవుతుంది.
ఎంపీలు స్పందిస్తే ఎంతోమేలు
నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైలు పొడగింపు కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికై న ఎంపీలు స్పందించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. బల్లార్షా జంక్షన్ నుంచి కాజీపేట జంక్షన్ వరకు పొడగించే ప్రయత్నాలు చేయాలి. దీంతోపాటు పెద్దపల్లి నుంచి నిజామాబాద్ రైల్వే మార్గంలో వారానికి మూడు రోజులు ముంబయికి రైలు నడపడంతోపాటు బల్లార్షా–వార్ధా మార్గంలో నూతన వీక్లీ సర్వీసు ప్రవేశ పెడితే ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు ముంబయి వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్రాంత ఎంపీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రైలు ప్రయాణికులు కోరుతున్నారు.
రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలి
కరోనా కంటే ముందు నడిపించిన ఆనంద్ వన్(రైలు నెం.22127/28) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును అర్ధంతరంగా రద్దు చేశా రు. ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పునః ప్రా రంభించలేదు. ఈ రైలు కాజీపేట జంక్షన్ నుంచి బయల్దేరి లోక్‌మాన్య తిలక్ టెర్మినల్ వయా బల్లార్షా, వార్ధా, అమరావతి, అకో లా భూసావల్, మన్మాడ్ మీదుగా ముంబ యి వెళ్లేది. ఈ రైలు వల్ల ప్రయాణ సమ యం తక్కువగా ఉండి ప్రయాణికులకు సౌ కర్యవంతంగా ఉండేది. కానీ ఈ రైలు నిలిపివేయడం వల్ల ముంబయి వెళ్లే ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు కష్టాలు పెరిగాయి.


