అమరులారా వందనం | - | Sakshi
Sakshi News home page

అమరులారా వందనం

Apr 21 2025 8:03 AM | Updated on Apr 21 2025 8:03 AM

అమరుల

అమరులారా వందనం

● అధికారిక స్మరణం.. ఆదివాసీల సంబురం ● 44 ఏళ్ల తర్వాత ఇంద్రవెల్లిలో స్వేచ్ఛగా నివాళి ● అమరుల త్యాగాలను స్మరించుకున్న నేతలు ● ఇచ్చిన మాట నెరవేర్చమన్న మంత్రి సీతక్క

భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం పోరాడి ప్రాణాలను త్యజించిన ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించింది. ఆంక్షలు లేకుండా వేడుకలు నిర్వహించడంపై ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన గిరిపుత్రులు 1981 ఏప్రిల్‌ 20న అమరులైన వీరులకు స్వేచ్ఛగా నివాళులర్పించారు. తొలుత ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గోండ్‌గూడ నుంచి తమ సంప్రదాయ వాయిద్యాల నడుమ స్తూపం వరకు చేరుకున్నారు. స్మారక జెండా వద్ద పూజలు చేశారు. అనంతరం అమరులకు నివాళులర్పించారు. – ఇంద్రవెల్లి/కై లాస్‌నగర్‌

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్మృతివనంలో ఆదివారం నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, జీసీసీ చైర్మన్‌ కొట్నాక్‌ తిరుపతి, మాజీ ఎంపీలు సోయం బాపూరావ్‌, వేణుగోపాలాచారి, ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్‌ పార్టీ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఆత్రం సుగుణతో కలిసి పూజలు చేసి జెండా ఆవిష్కరించారు. స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారికంగా సంస్మరణ దినోత్సవం నిర్వహించామన్నారు. ఆదివాసీలకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ ద్వారా భూ హక్కు కల్పించామని పేర్కొన్నారు. ఏజెన్సీలోని సమస్యలను పరిష్కరించేలా ఐటీడీఏ పీవో, కలెక్టర్‌, అటవీ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. స్మృతివనాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది ఆగస్టు 9న అధికారికంగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్రం భుజంగ్‌రావు రచించిన ‘ఆ గాయానికి 44 ఏళ్లు’ పేరిట ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మరోవైపు స్తూపం వద్ద, పరిసర ప్రాంతంలో ఉట్నూర్‌ ఏఎస్పీ కాజల్‌సింగ్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌, డీఎఫ్‌వో ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌, పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు, సార్‌మేడీలు, పటేళ్లు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్‌ఎస్‌ ఖానాపూర్‌ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్‌నాయక్‌లు తమ పార్టీ కార్యకర్తలతో కలిసి స్తూపం వద్ద నివాళులర్పించారు.

అమరవీరుల కుటుంబాలకు వాహనాలు అందజేత

అమరవీరుల కుటుంబీకుల్లోని భోరుజ్‌గూడ గ్రామానికి చెందిన హెరేకుమ్ర సావిత్రిబాయి, అనంతపూర్‌ గ్రామానికి చెందిన తొడసం హనుమంత్‌రావ్‌, సిరికొండ మండలంలోని సోన్‌పల్లి గ్రామానికి చెందిన సిడాం జంగు, పెందోర్‌ సీతాబాయిలకు ట్రైకార్‌ పథకం ద్వారా మూడు ట్రాక్టర్లు, ఒక బొలెరో వాహనాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే ఇంద్రవెల్లి, గుడిహత్నూర్‌, ఉట్నూర్‌ మండలాలతో పాటు శ్యాంపూర్‌ మండల సమాఖ్యలకు రూ.159.62 కోట్ల విలువైన సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీతో కూడిన రుణాల చెక్కులు అందజేశారు.

అమరులారా వందనం1
1/2

అమరులారా వందనం

అమరులారా వందనం2
2/2

అమరులారా వందనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement