No Headline
పదేపదే నేరాలు చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ సమీక్ష సమావేశంలో ఎస్పీ గంగాధర్‌రావు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు సమాచార వ్యవస్థను మరింత మెరుగుపరచాలని సీసీఎస్ సిబ్బందికి ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశపు హాలులో జిల్లాలోని సీసీఎస్ సిబ్బందితో ఎస్పీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాదిలో క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులు, ప్రాపర్టీ రికవరీ, నేరస్తులకు శిక్ష పడేలా చేసిన కృషి తదితర విషయాల గురించి ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.
బాధితులకు న్యాయం చేసి, జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. మంచి చేస్తే ప్రశంసిస్తానని, చెడు ప్రవర్తన కలిగిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాచార వ్యవస్థను క్షేత్రస్థాయిలో పటిష్టపరిచి దోపిడీలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు చేసే వారిపై నిఘా ఉంచా లని, పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించి వారిని కట్టడి చేయాలని ఆదేశించారు. జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులపై నిఘా ఉంచి, వారు మళ్లీ నేరాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలి. నగర శివారు ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉంచాలన్నారు.
నేరస్తులను గుర్తించడంలో, నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాల పాత్ర ప్రధానమైందని పేర్కొన్నారు. నేరం జరిగేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో గంజాయి విక్రేతల కదలికలు గమనిస్తూ, వారి ఆటలు కట్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ ఎ.సుభాష్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, రమణమ్మ, మోజెస్, డీసీఆర్‌బీ సీఐ సూర్యనారాయణ, పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ జె.వి.రమణ, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment