No Headline
మచిలీపట్నంటౌన్: బందరు నగరపాలక సంస్ధ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గుక్కెడు నీళ్లు గత 12 రోజులుగా లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయంలోని ఆర్వో ప్లాంట్ చిన్న పాటి మరమ్మతుకు గురై 12 రోజులైనా దీన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో కార్యాలయంలోని పలు విభాగాల సిబ్బంది కార్యాలయం పక్కనున్న దుకాణాల వద్దకు వెళ్లి తాగునీరు తెచుకుంటున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఓ విభాగానికి చెందిన సిబ్బంది ఖాళీ బాటిళ్లతో తాగునీటి కోసం మరో విభాగానికి వెళ్లి అడుగుతుండటంతో మాదీ మీ పరిస్థితేననే సమాధానంతో నిరాశతో వెనుతిరిగి బయటకు వెళ్లి తెచ్చుకుంటున్నారు.
దుర్వాసన
ఇదిలా ఉంటే కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది వినియోగించే మరుగుదొడ్లు, యారినల్ విభాగాలు అధ్వానంగా కనిపిస్తున్నాయి. మరుగుదొడ్లు దుర్వాసన వస్తుండటంతో వీటిని వినియోగించే సాహసం ఉద్యోగులు చేయటం లేదు. మరుగుదొడ్లు శుభ్రం చేసి రెండు నెలలైనా అధికారులు సమస్యను పరిష్కరించకుండా మిన్నకుండటంతో ముఖ్యంగా కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది పురుష ఉద్యోగులు అత్యవసరమైతే సమీపాన ఉన్న సినిమా హాళ్లలోని టాయిలెట్స్‌ను వినియోగించేందుకు వెళుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కార్యాలయంలోని మరుగుదొడ్లను శుభ్రం చేసే ఉద్యోగిని రెండు నెలల క్రితం డివిజన్లలో పారిశుద్ధ్య పనులకు వినియోగిస్తుండటంతో సమస్య మొదలైంది. పురుషుల యూరినల్స్ విభాగమైతే మరీ గబ్బు పట్టి, మరమ్మతులకు గురై ఉన్నాయి. యూరినల్స్ సింక్‌లు పగిలిపోయి, నీటి సరఫరా లేక దుర్వాసన వస్తోంది. కొంతమంది ఉద్యోగులు ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని వినియోగిస్తుండటంతో ఆ ప్రాంత మంతా దుర్వాసన వెదజల్లుతోంది.
మరమ్మతులకు నోచుకోని
ఎంఎంసీ కార్యాలయంలోని ఆర్వో ప్లాంట్
Comments
Please login to add a commentAdd a comment