జాతీయ సదస్సులో సిద్ధార్థ వైద్యులకు పతకాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): జైపూర్‌లో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకూ జరిగిన జాతీయ చర్మవ్యాధుల వైద్యుల సదస్సులో పాల్గొన్న విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల వైద్యులు, పీజీ విద్యార్థులు పలు అంశాల్లో సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి చర్మవ్యాధుల వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల చర్మవ్యాధుల విభాగాధిపతి డాక్టర్ టి.వాణి ఆధ్వర్యాన పీజీ విద్యార్థి డాక్టర్ ధర్మాకర్ సమర్పించిన పరిశోధన పత్రానికి బంగారు పతకం లభించింది. ఐడీఓజే జర్నల్‌కు సంబంధించి అత్యుత్తమ సమీక్షకురాలిగా డాక్టర్ టి.వాణి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరిని శనివారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు అభినందించారు.
ఆకాశవాణి విశ్రాంత వ్యాఖ్యాత ఏబీ ఆనంద్ మృతి
విజయవాడ కల్చరల్: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సీనియర్ అనౌర్స్‌గా చేసిన ఏబీ ఆనంద్ (ఆరుమళ్ల బ్రహ్మానందరెడ్డి) (87) అనారోగ్య కారణాలతో శనివారం విజయవాడ మాచవరంలోని స్వగృహంలో కన్నుమూశారు. 30 ఏళ్లకు పైగా ఆకాశవాణిలో పని చేసిన ఆయన తన రేడియో అనుభవాలను తెలియజేస్తూ స్వ...ర్..లోకం పేరిట నాలుగు పుస్తకాలను రచించారు. ఆయన రేడియో నాటికలు, ప్రకటనలు, డాక్యుమెంటరీలు, సాహితీమూర్తుల పరిచయాలు విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం తదితర కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి. 1970 నుంచి 1990 మధ్య కాలంలో ఉషశ్రీ ధర్మ సందేహాల నిర్వహణ అత్యంత ప్రజాదరణ పొందింది. ఆయన పదవీ కాలంలో గొల్లపూడి మారుతీరావు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సినీ నటుడు సీఎస్‌ఆర్ ఆంజనేయులు, విన్నకోట రామన్నపంతులు, నండూరి సుబ్బారావు, సి.రామ్మోనరావు, విన్నకోట విజయరాం, సుత్తి వీరభద్రరావు వంటి తెలుగు ప్రముఖల కార్యక్రమాలలో పాల్గొని వాటిని విజయవంతం చేశారు. ఆనంద్ మృతికి విజయవాడ ఆకాశవాణి కేంద్రం సహచరులు, ఉద్యోగులు, సాహితీ సంస్థల నిర్వాహకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చీపురుపట్టిన
వైద్యాధికారి
మచిలీపట్నంటౌన్: కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చిత్తజల్లు శర్మిష్ట శనివారం చీపురు పట్టారు. స్వర్ణ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆమె చీపురును చేపట్టి సిబ్బందితో కలసి కార్యాలయ ఆవరణను శుభ్రం చేశారు. ఆవరణలోని వ్యర్థాలను ఊడ్చి, పిచ్చి మొక్కలు తొలగించారు. కార్యక్రమంలో 104 నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయభారతి, డాక్టర్ నిరీక్షణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి
రూ.లక్ష విరాళం
వేదాద్రి(జగ్గయ్యపేట): యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన ఆచంట విష్ణువర్థన్ దంపతులు శనివారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. నగదును ఈవో కానూరి సురేష్‌బాబుకు అందజేశారు. గోసంరక్షణ నిమిత్తం వారు మరో రూ.40వేలు విరాళమిచ్చినట్లు వివరించారు. మరో ముగ్గురు దంపతులు నిత్యాన్నదానానికి రూ.5,116 చొప్పున అందజేశారని ఈఓ తెలిపారు.
జాతీయ సదస్సులో సిద్ధార్థ వైద్యులకు పతకాలు
జాతీయ సదస్సులో సిద్ధార్థ వైద్యులకు పతకాలు
జాతీయ సదస్సులో సిద్ధార్థ వైద్యులకు పతకాలు
Comments
Please login to add a commentAdd a comment