
సొరంగం భద్రత ప్రశ్నార్థకం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): చిట్టినగర్ సొరంగం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. 60 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సొరంగం లోపల నుంచి వస్తున్న నీటి ఊట ఇప్పుడు నీటి ధారలుగా మారింది. భారీ వాహనాల రాకపోకలే ఇందుకు కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పగటి వేళ బస్సులు, ట్రాక్టర్ల రాకపోకలతో బిజీగా ఉండే సొరంగ మార్గంలో రాత్రి పది గంటల తర్వాత ట్రావెల్ బస్సులు, లారీలు, టిప్పర్ల వేగానికి ప్రకంపనలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇదే పరి స్థితి మరి కొంత కాలం కొనసాగితే సొరంగం మను గడే ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొరంగంలో నీటి ఊటలను ఇటీవల విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు, నిపుణులు పరిశీలించారు. సొరంగం దెబ్బ తిన్నకుండా ఉండేందుకు కొండపై ఉన్న కొన్ని ఇళ్లను తొలగించాలని సూచించారు. ఈ నేపథ్యంలో తొలగించాల్సిన ఇళ్లను కార్పొరేషన్ అధికారులు గుర్తించారు.
నీటి ఊట ధారలై..
గతంలో సొరంగం లోపల మూడు నాలుగు చోట్ల నీటి ఊట ఛాయలు కనిపించేవి. అయితే ఒక ఏడాది నుంచి నీటి ఊట స్థానంలో లీకేజీలు ఏర్పడి నీరు ధారలుగా ప్రవహిస్తోంది. ఇప్పుడు ఆ నీటి ధారలు పదుల సంఖ్యకు చేరాయి. సొరంగం నుంచి ప్రయాణించే వారిపై నీటి ధారలు పడుకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రోడ్డుపైకి చేరిన నీరు మడుగుగా మారి, నాచు పట్టి ప్రమాదాలకు కారణమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి చెమ్మ ఉన్న చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సొరంగం సుందరీకరణ పనుల్లో భాగంగా వేసిన త్రీడీ పెయింటింగ్ సైతం నీటి ధారల వల్ల దెబ్బతింది.
సొరంగం పైభాగంలో ఇళ్లకు మార్కింగ్
సొరంగంలో నీటి ధారలు అధికం కావడంతో కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు రంగంలోకి దిగారు. 15 రోజుల కిందట మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో పాటు ఇంజినీరింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. సొరంగం మనుగడ దెబ్బతినకుండా చేపట్టాల్సిన చర్యలను వెంటనే తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంజినీరింగ్ అధికారులు రెండు రోజుల పాటు సొరంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పై భాగంలో ఉన్న ఇళ్లను తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొండపైకి చేరుకున్న అధికారులు కొన్ని ఇళ్లకు ప్రాథమికంగా మార్కింగ్ చేయడంతో పాటు నివాసితుల వివరాలను నమోదు చేసుకున్నారు. దీనిపై కమిషనర్‌తో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు.
నీటి ఊట, లీకేజీలతో సొరంగానికి ముప్పు
భారీ వాహనాలను నిషేధించాలంటున్న స్థానికులు
కొండపై కొన్ని ఇళ్లు తొలగించాలని వీఎంసీ నిర్ణయం

సొరంగం భద్రత ప్రశ్నార్థకం
Comments
Please login to add a commentAdd a comment