కిసాన్ క్రెడిట్ కార్డులు తక్షణమే జారీ చేయాలి
ఏపీ కౌలురైతుల సంఘం, ఏపీ రైతు సంఘం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకులు కౌలు రైతులకు ‘కిసాన్ క్రెడిట్ కార్డులు‘ తక్షణమే జారీ చేయాలని ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్నీడు యల్లమందారావు, ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెయ్యల వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రబీలో కౌలు రైతులకు ష్యూరిటీ లేని పంట రుణాలు వడ్డీ లేకుండా తక్షణమే మంజూరు చేయాలని, సాగు భూమి దామాషాను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలన్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్ సీవీఎన్ భాస్కరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ‘ఏపీ పంట సాగుదారు హక్కుల చట్టం 2019’ ప్రకారం గుర్తింపు కార్డులు పొందిన వారికి హామీలు లేకుండానే బ్యాంకు నుంచి పంట రుణాలు పొందవచ్చనని నిబంధనలు ఉన్నా వాటిని పాటించడం లేదని కౌలురైతుల ఆవేదనను లీడ్ బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. రుణాలు ఇవ్వాలని అడిగితే భూ యజమాని ష్యూరిటీ సంతకం పెట్టాలని, భూ యజమాని పంట రుణాలు తీసుకోకుండా ఉండాలంటూ ఇలా అనేక ఆంక్షలు పెడుతూ అప్పు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని తెలిపారు. దేవదాయ ధర్మాదాయ, వక్ఫ్ భూములు సాగు చేస్తున్న కౌలురైతులకు రుణాలు ఇవ్వాలని కోరారు. పంట రుణాల సమీక్ష సమావేశంలో కౌలు రైతులను, సంఘాల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని విన్నవించారు. లీడ్ బ్యాంకు కన్వీనర్ సి. భాస్కరరావు సానుకూలంగా స్పందించారన్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా లీడ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రమేష్ ను కలిసి జిల్లాలో రబీలో పంటరుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment