సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్వో చంద్రశేఖరరావు, అధికారులు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రధాని సూర్యఘర్‌ను వినియోగించుకుని ప్రతి ఇల్లూ.. సోలార్ రూఫ్‌టాప్‌తో వెలగాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాల్లో గురువారం వివిధ శాఖల ఉద్యోగులకు సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
డీఆర్వో మాట్లాడుతూ ప్రజలు అతి తక్కువ ఖర్చుతో లబ్ధిదారుల ఇంటిపై సోలార్ ప్యానల్‌ను ఏర్పాటు చేసుకోవడంతో తయారైన విద్యుత్‌ను ఉచితంగా గృహ అవసరాలకు వినియోగించుకోవచ్చన్నారు. దీంతో కరెంట్ బిల్లులు చెల్లించనక్కర్లేదన్నారు. 360 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్‌కు రూ. 78,400, 240 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్‌కు రూ. 60 వేలు, 120 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కిలోవాట్‌కు రూ. 30 వేలు ప్రభుత్వం రాయితీ ఇస్తోందన్నారు.
దాదాపుగా 20 ఏళ్లు సౌర విద్యుత్‌ను పొందవచ్చన్నారు. గృహ అవసరాలకు వినియోగించిన అనంతరం మిగిలిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇచ్చి ఆదాయం పొందవచ్చన్నారు. ప్రతి నెలా విద్యుత్ బిల్లులు చెల్లించే మొత్తంతో బ్యాంకు రుణం చెల్లిస్తే రుణం తీరిపోతుందన్నారు. ఈ పథకంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కాలయాపన లేకుండా వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఇప్పటికే బ్యాంకర్లకు సూచించామన్నారు. సమావేశంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పి.సాయిబాబు, కలెక్టరేట్ ఏవో సీహెచ్ వీరాంజనేయప్రసాద్, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment