రంగు చేపలతో ఉపాధి అవకాశాలు
పెనమలూరు: రంగు చేపల పెంపకంతో మహిళలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని పోరంకిలోని సేంద్రియ మంచినీటి జీవపాలన సంస్థ, ప్రాంతీయ పరిశోధన కార్యలయం ఇన్‌చార్జ్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రమేష్ రాథోడ్ అన్నారు. పోరంకిలోని ప్రాంతీయ కార్యాలయంలో గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మల్లవరం గ్రామ స్వయం సహాయ సంఘం మహిళా సభ్యులకు చేపల రంగంలో వ్యవస్థాపకత అభివృద్ధిపై శుక్రవారం ముగిసిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. నేడు రంగు చేపలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, వీటిని ఇంట్లో అలంకరణకు పెంచుకోవటానికి ప్రజలు చాలా ఆసక్తి చూపుతున్నారని వివరించారు. సైంటిస్టు అజిత్‌కేశవ్ చౌదరి మాట్లాడుతూ గ్లాస్ ఆక్వేరియమ్, చేపల మేత తయారు చేయటం నేర్చుకుంటే వ్యాపారం వృద్ధి చేసి లాభాలు పొందవచ్చన్నారు. మూడు రోజుల శిక్షణలో దీనిపైనే ప్రత్యేకంగా అవగాహన కల్పించామన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందచేశారు. నాగాయలంక బావదేవరపల్లి మత్స్య పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment