బాధ్యతతో ప్రాణాలు కాపాడుకుందాం
కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): వాహనదారులు బాధ్యతగా హెల్మెట్, సీటుబెల్టు ధరిస్తే రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2025 జనవరి నెలలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 90 రోడ్డు ప్రమాదాలు జరుగగా.. వాటిలో 41 మరణాలు, 76 మంది గాయాలపాలయ్యారన్నారు. జిల్లాలోని జాతీయ రహదారులపై ఏఐ పవర్ సీసీ టీవీల సాంకేతిక పరిజ్ఞానంతో అధిక వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించటం, హెల్మెట్ లేకుండా ప్రయాణించే చోదకులను గుర్తించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా జరిమానాలు విధించాలన్నారు.
●బందరు మండలం ఎస్.ఎన్‌గొల్లపాలెంలోని విద్యార్థులు సమీపంలోని జాతీయ రహదారిని దాటుకుని నేషనల్ కళాశాలకు చేరుకునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, రహదారిపై అకస్మాత్తుగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ఆ ప్రాంతంలో పరిష్కార మార్గాల కోసం రవాణా, జాతీయ రహదారులు, పోలీసులు ఉమ్మడి తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు.
●మచిలీపట్నం నగరంలో రహదారి వెంబడి ఏర్పాటు చేసిన శుభకార్యాలు, పుట్టినరోజులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
●జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ప్రధాన రహదారిపై వంగిపోయిన స్తంభాన్ని వెంటనే తొలగించాలన్నారు. మూడు స్తంభాల సెంటర్ నుంచి వచ్చే బైపాస్‌రోడ్డులో వినాయకుడి సెంటర్‌లో భారీ గుంతకు మరమ్మతులు చేపట్టాలన్నారు.
సమావేశంలో జిల్లా రవాణాధికారి బీఎస్‌ఎస్ నాయక్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎల్. సిద్ధిఖ్, నగరపాలక సంస్థ కమిషనర్ బాపి రాజు, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేశ్వరరావు, డీఎం అండ్‌హెచ్‌వో డాక్టర్ ఎస్. శర్మిష్ట పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment