సంప్రదాయ వస్త్రాలకు చిహ్నం కో–ఆప్టెక్స్
తమిళనాడు చేనేత జౌళి శాఖ మంత్రి ఆర్.గాంధీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు కో–ఆప్టెక్స్ చేనేత వస్త్రాలు చిహ్నలని, ఆప్కో, కో–ఆప్టెక్స్ షోరూమ్‌లలో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాలను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి ఆర్.గాంధీ అన్నారు. శుక్రవారం విజయవాడ ఏలూరు రోడ్డులో ఆధునికీకరించిన కో –ఆప్టెక్స్ షోరూంను తమిళనాడు చేనేత జౌళి శాఖ మంత్రి ఆర్.గాంధీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో చేనేత వస్త్రాలకు ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. తమిళనాడు ఆధ్వర్యంలోని కో–ఆప్టెక్స్ షోరూమ్‌లో ఆప్కో వస్త్రాలు, ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆప్కో షోరూమ్‌లో కో–ఆప్టెక్స్ వస్త్రాలు విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఎంతోమంది చేనేత కళాకారులు యంత్రాలు వినియోగించకుండా ఆకట్టుకునేలా చేనేత వస్త్రాలు రూపొందిస్తున్నారన్నారు. సాధారణ వస్త్రాలతో పోలి స్తే చేనేత వస్త్రాలు ముఖ్యంగా మహిళలు ధరించే చీర లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. మహిళల అధునాతన జీవనశైలి, అభిరుచులకు అనుగుణంగా కో–ఆప్టెక్స్ సైతం వస్త్రాల డిజైన్లలో మార్పులు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, తమిళనాడు కో– ఆప్టెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ జాకబ్, చీఫ్ జనరల్ మేనేజర్ ఎ.పి.రవి, జనరల్ మేనేజర్ శంకర్, రీజినల్ మేనేజర్ సి.నాగరాజన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment