భూముల రీసర్వేపై కలెక్టర్ సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో భూముల రీసర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ డీకె బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆర్డీవోలు, సర్వేశాఖ అధికారులతో గురువారం ఆయన రీసర్వే నిర్వహణపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలో భూముల రీసర్వే ప్రారంభించనున్న నేపథ్యంలో సమగ్ర రీసర్వే చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రీసర్వేను తూతూమంత్రంగా చేస్తే కుదరదని, ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా కచ్చితత్వంతో నిర్వహించాలన్నారు. రీసర్వే కోసం వచ్చే వారం తహసీల్దార్లు, డీటీ, సర్వేయర్లతో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి భూమికి ప్రత్యేక ఎల్‌పీఎం నంబరు ఇవ్వాలని, యజమాని పేరు రెవెన్యూ రికార్డుల్లో రావాలని సూచించారు. రీసర్వేలో తొలుత నిర్వహించే ప్రీ డ్రోన్ ఫ్లయింగ్ ప్రతి గ్రామంలో దాదాపుగా ఇప్పటికే పూర్తయ్యాయని, గ్రౌండ్ ట్రూతింగ్, డిజిటల్ మ్యాప్, చెక్‌లిస్ట్ ఆధారంగా భూమిపై నిజనిర్థారణ చేయాలన్నారు. వెబ్‌ల్యాండ్, ఎఫ్‌ఎంబీలో వివరాలు విస్తీర్ణం సరిపోలాలన్నారు.
గ్రామాల్లో ఉదయం వేళల్లో భూముల రీసర్వే చేపట్టాలని, గ్రౌండ్ ట్రూతింగ్‌కు ముందుగా గ్రామ సభ నిర్వహించాలన్నారు. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో చేసిన పనిని అదేరోజు కంప్యూటర్లలో నమోదు చేస్తే రీసర్వే సులువుగా పూర్తవుతుందన్నారు. తహసీల్దార్, మండల సర్వేయర్, డీటీలు సమావేశమై రీసర్వే ప్రక్రియపై సమీక్షించుకోవాలన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తులు పంచుకునే వారు, సబ్ డివిజన్ చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా ఉంటుందన్నారు. సర్వే పనుల రోజువారీ పర్యవేక్షణ కోసం ఆర్డీవో, జిల్లా సర్వే ల్యాండ్ అధికారి కార్యాలయంలో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, కెఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీవోలు కె.స్వాతి, బీఎస్ హేళాషారోన్, బాలసుబ్రహ్మణ్యం, జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అధికారి జోషీలా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment