జాతీయ ఓటర్ల దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం ఏర్పాట్లపై ఆయన కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 25వ తేదీన జిల్లా కేంద్రం మచిలీపట్నంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. 25వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు పాఠశాలల, కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించాలని చెప్పారు. ర్యాలీలో ప్ల కార్డుల ప్రదర్శన, నినాదాలు చేస్తూ ఓటు యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ర్యాలీ నిర్వహిస్తారన్నారు. కార్యక్రమాలలో ఎన్‌సీసీ, నెహ్రూ యువ కేంద్రం, యువజన సంఘాలను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. అనంతరం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జాతీయ ఓటర్ల దినోత్సవ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో తొలుత ప్రతిజ్ఞ చేయిస్తారని, కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం, అనంతరం వృద్ధ ఓటర్లకు సత్కారం, యంగ్ ఓటర్లకు ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం వివిధ కళాశాలలో పాఠశాల విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో అందరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. సమావేశంలో బందరు ఆర్డీవో కె.స్వాతి, బందరు డీఎస్పీ చప్పిడి రాజా, డీఈవో పి.వి.జె.రామారావు, డీఎస్‌డీవో ఝాన్సీలక్ష్మి, జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, తహసీల్దార్ నార్త్ వి.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment