లిటిల్ లైట్స్ హోమ్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
గన్నవరం: స్థానిక లిటిల్ లైట్స్ హోమ్‌లో సోమ వారం అర్ధరాత్రి చోటు చేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్కసారిగా చెల రేగిన మంటలు హాస్టల్ గదిని చుట్టుముట్ట డంతో విద్యార్థుల హాహాకారాలు మిన్నంటాయి. కొంత మంది విద్యార్థులు మంటలను తప్పించుకుని బయటపడగా, మరికొందరిని స్థానికులు, అగ్నిమాపక దళం రక్షించడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానిక రీచ్ విద్యా సంస్థల ప్రాంగణంలోని లిటిల్ లైట్స్ హోమ్‌లో మూడు నుంచి పదో తరగతి చదువుతున్న 140 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. సోమ వారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో పై అంతస్తులో ఉన్న గదిలో 35 మంది పిల్లలు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక బెడ్‌కు మంటలు అంటుకున్నాయి. సీలింగ్ ఫ్యాన్ల గాలికి పక్కపక్కనే ఉన్న బెడ్‌లకు ఆ మంటలు వేగంగా విస్తరించాయి. గది మొత్తాన్ని మంటలు చుట్టేయగా పొగ వ్యాపించింది. దీంతో నిద్ర నుంచి మేలుకున్న విద్యార్థులు మంటలు, పొగతో ఊపిరి అందక ఆందోళనతో బిగ్గరగా కేకలు వేశారు. హాస్టల్ గది మొత్తానికి ఒకే ద్వారం ఉండడంతో కొంత మంది అటుగా తప్పించుకుని బయటపడ్డారు. మిగిలిన విద్యార్థులు గదిలోనే ఉండిపోయారు. స్థానికులతో పాటు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని విద్యార్థులు చిక్కుకున్న గది కిటికీ అద్దాలను పగులకొట్టి మిగిలిన విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో నాల్గో తరగతి విద్యార్థి పులపాక అఖిల్ చేతికి గాయాలు కావడంతో మొదట గన్నవరం, విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి, అక్కడి నుంచి పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. ఎనిమిదో తరగతి విద్యార్థి కై లే ఉదయ్‌కిరణ్, మెండెం సిద్ధార్థ, తిరివీధి అఖిలేష్, టి.తేజశ్వర్, ఎన్.వినయ్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి దోమల చక్రం కారణమని ఫైర్ అధికారి షేక్ అహ్మద్ గుర్తించారు.
దోమల చక్రం వల్లే..
ఓ విద్యార్థి తను నిద్రిస్తున్న బెడ్ అంచున దోమల చక్రం వెలిగించాడు. ఆ చక్రం కొబ్బరి పీచుతోచేసిన బెడ్‌కు అంటుకోవడంతో మంటలు చెలరేగాయని తెలిపారు.
సీడబ్ల్యూసీ విచారణ
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు హాస్టల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన హాస్టల్ గదిని పరిశీలించారు. ఘటనకు కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దారు కె.వెంకటశివయ్య, ఎంఈఓ కొండా రవికుమార్, కమిటీ సభ్యులు రాజ్‌కుమార్, రవిభార్గవ్, రాధాకుమారి, ప్రేమ లత, సత్యవతి పాల్గొన్నారు.
విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
దోమల చక్రమే ఘటనకు కారణం
లిటిల్ లైట్స్ హోమ్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
లిటిల్ లైట్స్ హోమ్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment