సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు సూచించారు. గొల్లపూడిలోని గ్రామీణాభివృద్ధి సంస్థ సెమినార్ హాల్‌లో మంగళవారం జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసించేసి, వారి బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును వివిధ రూపాల్లో దొంగిలిస్తున్నారని పేర్కొన్నారు. వారు పంపే అబద్ధపు మెసేజ్‌లతో ప్రభావితం కావద్దని, అనవసరపు లింక్‌లను ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కె.ప్రియాంక మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్సఫర్మేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ వి.అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ పోర్టల్‌లో తప్పనిసరిగా చేరాలని పేర్కొన్నారు. ట్రైనర్ వై.బాబూరావు మాట్లాడుతూ.. బ్యాంకుల ద్వారా ఆర్థిక, సామాజిక భద్రత పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ గొల్లపూడి బ్రాంచి మేనేజర్ కె.వి.విజయలక్ష్మి, ఎం.సునీత లక్ష్మి, ట్రైనర్ ఎం.ఆశా, రిసోర్స్ పర్సన్లు కె.శ్రీనివాసరావు, ఆర్.పవన్‌కుమార్, ఏపీడీ చంద్రశేఖర్, ఏరియా కో–ఆర్డినేటర్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన ఆర్థిక అక్షరాస్యత బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment