కర్ణాటక బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కర్ణాటక బ్యాంకులో కిలోల కొద్దీ బంగారు నగలను మాయం చేసిన అసిస్టెంట్ మేనేజర్‌ను అరెస్టు చేసిన కృష్ణా జిల్లా పోలీసులు పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు బుధవారం రాత్రి తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు.. మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంకులో విజయవాడకు చెందిన గన్నే సోమేశేఖర్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. క్రికెట్, పేకాట, ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన సోమ శేఖర్ బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకోవటం మొదలుపెట్టాడు. బ్యాంకు అధికారులకు తెలియకుండా ఖాతాదారులు తాకట్టు పెట్టిన మూడు కిలోల బంగారు నగలను లాకర్ నుంచి తీసి, విజయవాడలోని నాన్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లతో పాటు తాను పనిచేసే బ్యాంకులోనూ తాకట్టుపెడుతూ వచ్చాడు. తాకట్టు పెట్టగా వచ్చిన సొమ్ముతో జల్సా చేయటంతో పాటు జూదాల్లో పెట్టి పోగొట్టుకున్నాడు. ఇటీవల కర్ణాటక బ్యాంకు అధికారులు ఆడిట్ చేయగా తాకట్టులో ఉన్న బంగారు నగల లెక్క తేలలేదు. అనుమానం వచ్చిన అధికారులు ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు బందరు డీఎస్పీ సీహెచ్.రాజా ఆధ్వర్యంలో ఆర్‌పేట సీఐ ఏసుబాబు, చిలకలపూడి సీఐ ఎస్‌కే నబీ, సీసీఎస్ సీఐ కె.వి.ఎస్.వరప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. నిందితుడు సోమశేఖర్‌ను గత నెల 31వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అతడికి రిమాండ్ విధించింది. నిందితుడు సోమశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్న పోలీసులు విజయవాడలోని నాన్ ఫైనాన్స్ కంపెనీల్లో సోమశేఖర్ తాకట్టుపెట్టిన రెండున్నర కిలోల నగలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని మరికొన్ని నాన్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టినట్లు తెలుసుకున్న పోలీసులు, దానిని కూడా రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి తక్కువ సమయంలో నిందితుడిని అరెస్ట్ చేయటంతో పాటు రెండున్నర కిలోల బంగారు నగలను రికవరీ చేసిన సీఐలతో పాటు ప్రత్యేక బృందాలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నాన్ ఫైనాన్స్ కంపెనీలు, గోల్డు లోన్‌లు ఇచ్చే ఇతర సంస్థలు బంగారంపై ఖాతాదారులకు రుణాలు ఇచ్చే ముందు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, బందరు డీఎస్పీ సీహెచ్ రాజా, సీఐలు, ఏసుబాబు, నబీ, వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం
మిగిలిన నగల రికవరీకి చర్యలు
వివరాలు వెల్లడించిన ఎస్పీ గంగాధరరావు
Comments
Please login to add a commentAdd a comment