డేంజర్ బెల్స్
మూడు దశాబ్దాల కిందట ప్రజలను వణికించిన ఎయిడ్స్ మహమ్మారి మళ్లీ జూలు విదిలిస్తోంది. ఇటీవల కాలంలో కృష్ణాజిల్లాలో హెచ్‌ఐవీ కేసులు మళ్లీ చాప కింద నీరులా గప్‌చిప్‌గా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తక్షణం తగిన చర్యలు తీసుకోకపోతే జిల్లాలో మళ్లీ మరణ మృదంగం వినిపించే ప్రమాదం ఉంది.
మచిలీపట్నంఅర్బన్: భాగస్వామితో కాకుండా ఇతరులతో కలవటం, విచ్చలవిడి శృంగారం, సురక్షిత పద్ధతులు పాటించకపోవటం ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి బారిన పడేలా చేస్తోంది. భార్య కడుపులో ఉన్న బిడ్డకు సైతం హెచ్‌ఐవీ సోకుతోంది. కృష్ణాజిల్లాలో ఇటీవల వెలుగు చూస్తున్న హెచ్‌ఐవీ కేసులను బట్టి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
చాప కింద నీరులా...
మచిలీపట్నం జీజీహెచ్ ఏఆర్టీ సెంటర్లో 8810, గుడివాడ 3197 మంది హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. గతంలో మచిలీపట్నంకు చెందిన ఓ మహిళ వైద్య పరీక్షల కోసం స్థానికంగా నిర్వహించిన మెడికల్ క్యాంపులో చేసిన రక్త పరీక్షలలో పాజిటివ్ రాగా పెద్దాస్పత్రికి వెళ్తే అక్కడ ఆమెకు హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త కారణంగా తనకీ దుస్థితి పట్టిందని తెలుసుకున్న ఆమె తీవ్ర మనోవేదనకు లోనైంది. కొంతకాలం క్రితం రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఒక యువకుడికి హెచ్‌ఐవీ సోకిందని నిర్థారణ అవడంతో అతను వేదనతో కుంగిపోయాడు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయంలో...
జిల్లా పరిధిలో ఉన్న రెండు ఏఆర్టీ, 7 ఐసీటీసీ కేంద్రాల ద్వారా హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు తరచూ వైద్య సేవలు అందించారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడినా గ్రామస్థాయిలో ఉన్న ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తల ద్వారా పర్యవేక్షణ తప్పనిసరి చేశారు. మూడు నెలల పాటు ఏఆర్టీ కేంద్రాల ద్వారా మందులు వాడిన వారికి పింఛను అందజేశారు.
గర్భిణులకు సోకుతుండటంపై ఆందోళన
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను గుర్తించటం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టగలం అనే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షల సంఖ్యను పెంచాలి. జిల్లాలో 2024 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు జనరల్ క్లయింట్స్ 27,205 మందికి పరీక్షలు చేస్తే 1.25 శాతం పాజిటివిటీగా గుర్తించారు. ప్రతి గర్భిణికి హెచ్‌ఐవీ పరీక్షలు చేస్తున్నారు. ఇలా 2023–24 ఏడాదిలో 32,765 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో 0.02 శాతం, 2024 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 17,699 మందికి పరీక్షలు చేయగా 0.06 పాజిటివిటీ ఉందని తేల్చారు.
ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు
సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లు, మాదక ద్రవ్యాలను సూదుల ద్వారా ఎక్కించుకునే వారి ద్వారా హెచ్‌ఐవీ ఎక్కువగా విస్తరిస్తుందని వైద్యశాఖాధికారులు భావిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకు లు, ల్యాబ్‌లలో హెచ్‌ఐవీ పరీక్షలు పాజిటివ్ తేలినా ఎలాంటి సమాచారం ఐసీటీసీలకు అందించడం లేదని వైద్యవర్గాలు అంటు న్నాయి. దీనికి తోడు వారికి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టే స్వచ్ఛంద సంస్థల నిర్వహణకు ఏపీ సాక్స్ నుంచి అరకొర నిధులు కేటాయిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. ఇందువల్ల ఆయా సంస్థలు కాగితాల్లోనే తప్ప క్షేత్రస్థాయిలో కనిపించటం లేదు. ఏపీ సాక్స్ నిధులతో నిర్వహిస్తున్న సంస్థల కార్యకలాపాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు తక్షణం మేల్కొని హెచ్‌ఐవీ నియంత్రణకు తక్షణ తగిన చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉంది.
మళ్లీ పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు గర్భిణులకు సోకుతుండటంపై ఆందోళన
గర్భిణులు సంవత్సరం పరీక్షలు పాజిటివ్ కేసులు
2023–24 32,765 0.02 శాతం
2024 ఏప్రిల్ నుంచి 17,699 0.06 శాతం
అక్టోబర్ వరకు
జనరల్ క్లయింట్స్
సంవత్సరం పరీక్షలు పాజిటివ్ కేసులు
2023–24 39834 1.39 శాతం
2024 ఏప్రిల్ నుంచి 27,205 1.25 శాతం
అక్టోబర్ వరకు
డేంజర్ బెల్స్
Comments
Please login to add a commentAdd a comment