నిర్భయంగా తినండి
చల్లపల్లి: కోడిగుడ్డు, కోడి మాంసం ఎటువంటి సందేహాలు, అపోహలు లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ నిర్భయంగా తినవచ్చని పశుసంవర్థక శాఖ కృష్ణాజిల్లా జాయింట్ డైరెక్టర్ చిన్న నరసింహులు అన్నారు. చల్లపల్లి లోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రలో బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్, జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం, కృష్ణాజిల్లా లేయర్స్ ఫార్మర్స్ వెల్‌ఫేర్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గుడ్డు, చికెన్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు పశు సంవర్థక శాఖ జాయింట్ డైరె క్టర్‌తో పాటు, కృష్ణాజిల్లా డీఎంహెచ్‌ఓ శర్మిష్ట, మచిలీపట్నం ఆర్డీవో స్వాతి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ రంగ ప్రముఖులు మాలెంపాటి కాంచనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిన్న నరసింహులు మాట్లాడుతూ సాధారణంగా ఈ వైరస్ మొదట నాటుకోళ్లకు, ఆ తరువాత బ్రాయిలర్, ఫారం కోళ్లకు సోకుతుందని అన్నారు. ఏ ప్రాంతంలో అయితే ఈ వైరస్ గుర్తించారో ఆ ప్రాంతానికి 10 కిలోమీటర్లు చుట్టూ సర్వైలెన్స్ జోన్‌గా ప్రకటించి అక్కడి నుంచి కోళ్లు, కోళ్ల ఉత్పత్తులైన గుడ్లు వంటివి ఒక్కటి కూడా బయటకు రానీయకుండా పటిష్టంగా కట్టడి చేస్తామని వివరించారు. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క బర్డ్స్‌ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని, ప్రజలు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా గుడ్లను, చికెన్ ను ఆనందంగా తినవచ్చని భరోసా ఇచ్చారు. డీఎంహెచ్‌ఓ శర్మిష్ట మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ అంటే పక్షులకు సోకే వైరస్ అని, మనుషులకు సోకేది కాదని, ఒకవేళ ఇలాంటి వైరస్‌లు మనుషులకు సోకితే వాటిని 99.99 శాతం నివారించటానికి తమ వద్ద మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు.
మచిలీపట్నం ఆర్డీవో స్వాతి మాట్లాడుతూ ప్రస్తుతం బర్డ్స్‌ఫ్లూ వదంతుల కారణంగా ప్రజలు గుడ్లకు, చికెన్‌కు దూరమయ్యారని, నిర్భయంగా వాటిని తినవచ్చని అన్నారు. అనంతరం ఎగ్, చికెన్ మేళాకు విచ్చేసిన అధికారులు, పౌల్ట్రీ సంఘాల నాయకులు, ప్రముఖులు, పౌల్ట్రీ రైతులు అందరూ ఉడకబెట్టిన కోడిగుడ్డు, ఫ్రై చేసిన చికెన్ ముక్కలు తిన్నారు. సుమారు వెయ్యి మందికి ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి రథసారథి డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, వైద్యులు సుజని, కృష్ణాజిల్లా అసోసియేషన్ నాయకులు వి.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణాజిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదు కోడి గుడ్డు, కోడి మాంసం హాయిగా తినొచ్చు పశు సంవర్థక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ చిన్న నరసింహులు
Comments
Please login to add a commentAdd a comment