సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల అదుపు
పామర్రు: నేరాలను అదుపు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి విజయాలు సాధిస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. పామర్రు సర్కిల్ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. స్టేషన్‌లోని రికార్డులను రిజిష్టర్లను తనిఖీలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈగిల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దీని ద్వారా గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి పాఠశాలలో ఈగిల్ క్లబ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
పాత నేరస్తులపై నిరంతర నిఘా
పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంటుందని ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. వీరి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఎప్పుడు పోలీస్ శాఖకు అవసరమైతే అప్పుడు వివరాలను త్వరితగతిన అందించేందుకు సిద్ధంగా ఉంటున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావు, గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్, పామర్రు సీఐ సుభాకర్, పామర్రు ఎస్‌ఐ రాజేంద్ర ప్రసాద్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
గన్నవరం ట్రాఫిక్ పీఎస్ తనిఖీ చేసిన ఐ.జి
గన్నవరం: స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావుతో కలిసి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌బాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించిన ఐజీ స్టేషన్ సిబ్బంది, ట్రాఫిక్ రద్దీ వివరాలను సీఐ పెద్దిరాజును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడంతో వీవీఐపీలు, వీఐపీలు రాకపోకల వల్ల ట్రాఫిక్ రద్దీ ఎక్కువగానే ఉందన్నారు. ఇటీవల రాష్ట్రస్థాయి సభలు, సమావేశాలు కూడా ఈ ప్రాంతంలోనే నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం పూర్తయితే ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. ట్రాఫిక్ పోలీసుల పనితీరును మరింత మెరుగుపర్చేందుకు త్వరలో కృష్ణాజిల్లాలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోలీస్ స్థలాలను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఒక నివేదిక తయారు చేస్తున్నట్లుగా తెలిపారు. త్వరలో చేపట్టనున్న పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కానున్నట్లు చెప్పారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, లా అండ్ ఆర్డర్ సీఐ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment