శ్రీ అద్దంకి నాంచారమ్మ జాతర మహోత్సవం ప్రారంభం
పెదప్రోలు(మోపిదేవి): మండలంలోని పెదప్రోలు గ్రామంలో ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని సోమవారం చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ప్రారంభించారు. ప్రతి ఏడాది అమ్మవారికి 15 రోజుల పాటు ఇంటింటా దర్శనం కల్పించిన అనంతరం పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున జాతర నిర్వహించి ఆలయ ప్రవేశం చేస్తామని ఆలయ కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు తెలిపారు. ఆలయ అభివృద్ధిలో బాగంగా గత ఏడాది చేపట్టిన తవ్వకాల్లో రాతి శిలాశాసనం బయట పడిందని, దానిపై 1919లో గుంటూరు జిల్లా పద్మ శాలీల అమ్మవారుగా గుర్తించి వారి వంశీకులకు సమాచారం ఇచ్చామని, జాతరలో తొలిపూజలు చేసుకునేందుకు వారికి అవకాశం కల్పించినట్లు వివరించారు. ఈ ఏడాది నుంచి గ్రామ జాతరలో తొలిపూజలు పద్మశాలీల వంశీకులు చేపట్టినట్లు తెలియజేశారు. గ్రామ సర్పంచ్ పొలిమెట్ల ఏసుబాబు, మాజీ సర్పంచ్ మద్దిపట్ల జగన్మోహనరావు, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల వెంకట్రామయ్య, కుర్రా గురుప్రసాద్, పీఏసీఎస్ మాజీ చైర్‌పర్సన్ ఆది రాంబాబు, ఎస్‌ఐ సత్యనారాయణ, ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల వంశీకులు పడవల వెంకట సుబ్బారావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment