
సాంకేతిక విద్య.. ఉజ్వల భవిత
గుడ్లవల్లేరు: సాంకేతిక విద్యతో విద్యార్థులు ఉజ్వల భవిష్యత్‌ను పొందొచ్చు. పదో తరగతి ఉత్తీర్ణతతో సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిసెట్ ఏప్రిల్ 30వ తేదీన జరగనుంది. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్– 2025ను ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందొచ్చు. పదో తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగానే సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు పాలిసెట్ తేదీని విడుదల చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు.
తక్కువ ఖర్చతో సాంకేతిక విద్య
పాలిటెక్నిక్‌లో ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే, దానిని పునాదిగా మార్చుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక విద్యను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదిక లని పలువురు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందొచ్చని సూచిస్తున్నారు. పాలిసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుల తుది గడువును ప్రకటించలేదు.
పదో తరగతి విద్యార్థులకు మంచి అవకాశం ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందుబాటులో 11,232 సీట్లు
లభించే కోర్సులు ఇవీ..
పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెర్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 60 నుంచి 120 వరకు సీట్లు అందుబాటులో ఉంటాయి. ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో 11,232 సీట్లు ఉన్నాయి. నాలుగు ప్రభుత్వ, 24 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. పాలిటెక్నిక్ కోర్సుల కాల వ్యవధి మూడేళ్ల వరకు ఉంటుంది. ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ కూడా ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు.
పాలిసెట్ ఎంట్రన్స్ ఇలా..
పాలిసెట్– 2025 ఎంట్రన్స్‌ను 120 మార్కులకు నిర్వహిస్తారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment