
మానవతా నాడి ‘పట్టా’లి
గుంటూరు మెడికల్: వైద్యులు రోగుల పట్ల జాలి, దయ కలిగి ఉండాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ డి.ఎస్.వి.ఎల్.నరసింహం అన్నారు. మంగళవారం గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో 74వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జరిగాయి. వైద్య కళాశాల 2019 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులకు డీఎంఈ డాక్టర్ నరసింహం డిగ్రీ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహం మాట్లాడుతూ వైద్య రంగంలో మానవతా విలువలకు పెద్ద పీట వేయాలని చెప్పారు. వైద్య రంగంలో రోబోటిక్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వచ్చినా హ్యూమన్ టచ్ ఇవ్వలేవని, వైద్యుడికే అది సాధ్యమని పేర్కొన్నారు. రోగిపై సానుభూతి, మానవతా దృక్పథం కలిగి ఉండాలన్నారు.అనంతరం నరసింహంను నిర్వాహకులు సత్కరించారు.
మాతృసంస్థ అభివృద్ధికి తోడ్పడండి
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ మాట్లాడుతూ గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో రూ.100 కోట్లతో ఎంసీహెచ్ నిర్మాణం జీజీహెచ్‌లో జరుగుతుందని చెప్పారు. 2026 జనవరి నాటికి భవనం అందుబాటులోకి వస్తుందని, ప్రభుత్వం రూ.40 కోట్ల విలువ గల వైద్య పరికరాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య కళాశాలలో చదువుకున్నవారంతా వైద్య వృత్తిలో బాగా స్థిరపడిన తరువాత మాతృ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారీ మాట్లాడుతూ రోగుల పట్ల జాలి, దయ కలిగి ఉండాలని, నేడు చాలా మంది వైద్యులు కఠినంగా మారిపోయారని పేర్కొన్నారు. రోబో మాదిరిగా యాంత్రికంగా వైద్యులు మారిపోయారని, వైద్య వృత్తి వ్యాపారంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రభాకర్, జింఖానా కో–ఆర్డినేటర్ పి.వి.హనుమంతరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment