
బుడమేరుకు పొంచివున్న కడగండ్లు
అడుగడుగునా నిర్లక్ష్యం ●
● డైవర్షన్ కెనాల్ గండ్ల నుంచి ఆగని ఊట ● పంటపొలాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న లీకేజీ నీరు ● ఆధునికీకరణను గాలికొదిలేసిన ప్రభుత్వం ● హెడ్ రెగ్యులేటర్‌కు మరమ్మతులు చేపట్టని వైనం ● సైపన్‌ల వద్ద ప్రమాదకరంగా మారిన కెనాల్ కట్ట
గేట్లకు మరమ్మతులేవీ?
వరద విధ్వంసం సమయంలో బడుమేరు ప్రక్షాళన, ఆధునికీకరణ అంటూ మీడియా ముందు గొప్పలు చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా ఒక్క అడుగూ వేయలేదు. కనీసం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లకు మరమ్మతులు చేపట్టలేదు. 11 గేట్లలో మూడు గేట్ల సపోర్టింగ్ రాడ్‌లు వంకరపోయి పైకి లేపాలన్నా, కిందకి దింపాలన్నా ఇబ్బందిగా మారింది. రెండు గేట్లు పూర్తిగా కిందకి దిగకపోవడంతో పట్టసీమ జలాలు వచ్చినప్పుడు నీరు లీకవ్వకుండా ఇసుక బస్తాలను వేశారు. వరదచ్చి ఆరు నెలలు గడిచినా ఈ గేట్ల మరమ్మతులను గాలికొదిలేయడంతో గేట్ల కింద ఇసుక బస్తాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువున బుడమేరు గండ్లను పూడ్చేందుకు రూ.29 కోట్ల ఖర్చవుతుందని అధికారులు ప్రభుత్వానికి అంచనాలు పంపినా నిధులు మాత్రం విడుదల కాలేదు. దీంతో మళ్లీ వరద ముప్పు తప్పేలా లేదని బడమేరు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
జి.కొండూరు: అసలే పొలాల్లో మట్టి మేటలు. గండ్ల నుంచి ఆగని నీటి ఊట. ఒక పంటకు వరద పోటు. మరో పంటకు నీటి కరువు. వచ్చే ఖరీఫ్‌లో సాగుకు అవకాశం ఉంటుందో లేదో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు పడిన గండ్లను తాత్కాలికంగా పూడ్చి చేతులు దులుపుకొంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే పరిశీలించి డైవర్షన్ కెనాల్ ఆధునికీకరణ చేస్తామంటూ ఇచ్చిన హామీ నీటి మూటగా మిగిలింది. బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు పూడ్చిన గండ్ల నుంచి ఊట ఆగడంలేదు. ఊట నీరు పొలాల మీదగా ఉధృతంగా ప్రవహిస్తోంది. బుడమేరు వరద కారణంగా పొలాల్లో మూడు నుంచి ఐదు అడుగుల మేర మట్టి మేటలు వేసింది. ఇప్పుడు గండ్ల నుంచి వస్తున్న నీటి ఊట ఆ పొలాల మీదుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో మూడు నెలల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఇప్పుడు ఈ పొలాల్లో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపది కన నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే 50 ఎకరాల వ్యవసాయ భూమి నీటి కుంటలా మారే ప్రమాదం పొంచివుంది.
ఊట ఆగడం కష్టమే
గత ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు వరదతో పోటెత్తింది. వరద ఉధృతితో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్లు మేర ఉన్న బుడమేరు డైవర్షర్ కెనాల్‌కు ఎడమ వైపు కట్టకు మూడు చోట్ల, కుడి వైపు కట్టకు ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువ భాగాన బుడమేరుకు 42 కిలోమీటర్ల మేర 65 వరకు గండ్లు పడ్డాయి. డైవర్షన్ కెనాల్‌కు పడిన గండ్లను మాత్రం మిలటరీ సాయంతో పూడ్చారు. డైవర్షన్ కెనాల్ ఎడమ కట్టకు పడిన మూడు గండ్ల నుంచి నిత్యం నీటి ఊట వస్తూనే ఉంది. వీటీపీఎస్ బ్యాక్ వాటర్ కవులూరు హెడ్ రెగ్యులేటర్ వరకు పోటువేసి ఉండడంతో గండ్లు పూడ్చిన ప్రదేశం నుంచి నీరు లీకై సమీపంలోని పొలాల మీదుగా ప్రవహిస్తూ తారకరామ ఏడమ కాలువలో కలుస్తోంది. గండ్లకు సమీపంలోని 50కి పైగా ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది.
సైపన్‌ల వద్ద పొంచి ఉన్న ప్రమాదం
బుడమేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కొండపల్లి శాంతి నగర్ వంతెన వరకు డైవర్షన్ కెనాల్ ఎడమ కట్టకు ఐదు సైపన్‌లు ఉన్నాయి. గత వరదకు కుడి, ఎడమ వైపు కట్టలకు సైపన్‌లు, తూముల వద్దనే ఎక్కవ శాతం గండ్లు పడ్డాయి. సైపన్‌ల వద్ద గండ్లు పూడ్చేందుకు మట్టిపోసి వదిలేశారు. బలోపేతం చేయకపోవడంతో సాధారణ నీటి ప్రవాహానికే గండ్లు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎడమ కట్టకు పడిన ప్రధాన గండి వద్ద కట్టనైతే బలోపేతం చేశారు కానీ సైపన్ వద్ద తూతూమంత్రంగా పూడ్చి వదిలేశారు. సైపన్ వద్ద మళ్లీ గండి పడే అవకాశం ఉన్నందున కాంక్రీటుతో కట్టను బలోపేతం చేయా లని రైతులు కోరుతున్నారు. సైపన్ వద్ద కట్ట తక్కువ ఎత్తులో వెడల్పుగా లేనందున వ్యవసాయభూములకు ఈ కట్టమీదుగా ట్రాక్టర్లతో రాకపోకలు సాగించే వీలు లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు.

బుడమేరుకు పొంచివున్న కడగండ్లు
Comments
Please login to add a commentAdd a comment